నమస్తే తెలంగాణ పత్రికకు ఐఏఎస్ ఆఫీసర్ సీరియస్ వార్నింగ్

నమస్తే తెలంగాణ పత్రిక టిఆర్ ఎస్ అనుకూల పత్రికని జగమెరిగిన సత్యం. విపక్షాలు అయితే నమస్తే తెలంగాణ పేపర్ టిఆర్ ఎస్ ఫాం ప్లేట్ అని కూడా విమర్శించాయి. నమస్తే తెలంగాణ పేపర్ తనను కించ పరుస్తూ వార్త ప్రచురించిందని ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళిని నమస్తే తెలంగాణ పేపర్ ఎడిటర్ కు లేఖ రాశారు. ఏ వార్త అయితే కించపరుస్తూ ప్రచురించారో అదే ప్లేసులో తనకు క్షమాపణ చెబుతూ ప్రచురించాలని లేనిచో చట్టబద్దంగా చర్యలు తప్పవని మురళి హెచ్చరించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల ఐఏఎస్ ఆఫీసర్లకు అన్యాయం జరుగుతోందని నిరసిస్తూ ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఐఏఎస్ లు సమావేశమయ్యారు. స్థానిక ఐఏఎస్ ల సంఘం ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. 

వీటన్నింటి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని , ఐఏఎస్ మురళి కాంగ్రెస్ వారితో చేతులు కలిపాడని ప్రచురించారు. ఓ వర్గానికి చెంచా, కీలు బొమ్మ అంటూ ప్రచురించారు. దళిత ఐఏఎస్ ఆఫీసర్ ను కించపరుస్తూ, తన ప్రతిష్టను దెబ్బ తీశారని మురళి లేఖలో పేర్కొన్నాడు. నమస్తే తెలంగాణ ప్రచురించిన పేపర్ క్లిప్పింగ్ లు.. 

 

 

 

 

 తనకు క్షమాపణ చెప్పాలని లేఖపోతే న్యాయ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మురళి రాసిన లేఖలో ఏముందంటే…

TO:
ది ఎడిటర్,
నమస్తే తెలంగాణ,
హైదరాబాద్.

విషయం: ఈ రోజు(31/10/2018) మీ నమస్తే తెలంగాణలో “ఐఏఎస్ కిస్సా వెనుక కాంగ్రెస్ హస్తం” అనే శీర్షిక ప్రచురితమైన వార్త గురించి.

మీ వార్తలో నన్ను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని, నిరాధార ఆరోపణలను నేను తీవ్రమైన విషయంగా భావించి ఖండిస్తున్నాను.

గత 25 సంవత్సరాలుగా కొప్పుల రాజు గారితో నాకు సన్నిహిత సంబంధం ఉన్న మాట నిజం. ఎందుకంటే ఆయనతో పేద ప్రజల అభివృద్ధికి సంబంధించిన రకరకాల ప్రాజెక్టులలో 13 సంవత్సరాలుగా కలిసి పని చేయటం జరిగింది. అందుకని నన్ను మీరు కాంగ్రెస్ తో అంటగట్టడం చాలా అమానుషమైన చర్య. కొప్పుల రాజు గారిని కలవడం మాట్లాడటం నేరపూరితం కాదు. పూర్వ సంబంధాల రీత్యా ఎంతో మంది IAS అధికారులు కూడా ఆయనతో మాట్లాడటం జరుగుతుంది.

ఒక దళిత IAS అధికారిని ఆయిన నన్ను ఒక వ్యక్తికి చెంచా, ఒక వ్యక్తి చేతిలోని కీలుబొమ్మ అనే అవమానకరమైన పదజాలంతో దూషిస్తూ రాయటం తీవ్రమైన నేరం. ఇది నన్ను ఎంతో మానసిక క్షోభకు గురిచేసింది.

దళిత మరియు బిసి వర్గాలకు చెందిన ఐఎఎస్ అధికారులు కలిసి వారి సమస్యల గురించి మాట్లాడుకోవడాన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మీరు మీ పత్రికలో వర్ణించటం ఏ విధంగా కరెక్ట్ అవుతుంది.

నాకు కాంగ్రెస్ పార్టీ MLA టిక్కెట్ ఇవ్వజూపిందనే ఒక ఊహాజనిత వార్తను మీరు ప్రచురించడం ద్వారా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంగా భావిస్తున్నాను.

పైన తెలిపిన తప్పుడు వార్తలో అసభ్య పదజాలంతో నన్ను దూషించటం మరియు నిరాధార ఆరోపణలు చేయటం వలన నేను తీవ్ర మానసిక క్షోభకు గురి అయ్యాను. 37 సంవత్సరాలుగా ప్రభుత్వంలో మరియు అంతర్జాతీయ స్థాయిలో నీతి నిజాయితీలతో, అవినీతికి దూరంగా, చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టపడి నిర్మించుకున్న నా వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టారు.

అందువలన నేను కోరేదేటంటే మీరు నాకు పత్రిక ముఖంగా బేషరతుగా క్షమాపణలు చెప్తూ నా ఈ వివరణను మీ పత్రికలో పై వార్త ఏ పేజీలో అయితే వచ్చిందో అదే పేజీలో ప్రచురించాలి. లేనిచో రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను ఉపయోగించుకుని చట్టరీత్యా తగుచర్యలు తీసుకుంటానని మీకు తెల్పడమైనది.

ఇట్లు
మీ భవదీయుడు,
ఆకునూరి మురళి, IAS