వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి స్థానచలనం?

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున్న కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను బదిలీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి బదిలీ తప్పేట్టు లేదు. రెవెన్యూశాఖ, పోలీసు శాఖలో పని చేస్తున్న వారిని బదిలీ చేయడానికి ఇప్పటికే జాబితా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేయాలనే ఆలోచనలో భాగంగానే  ప్రభుత్వం ముగ్గురిని ముందుగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధర్ సిన్హాకు సీసీఎల్ ఏ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీసీఎల్ ఏ బాధ్యతల్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారీ నిర్వర్తిస్తున్నారు. బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యాటక. యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఒకే దగ్గర మూడేళ్ల సర్వీసు పూర్తి అయిన వారికి బదిలీ తప్పదని ఐఏఎస్ లాబీల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ లకు బదిలీ తప్పని సరని దాదాపు ఖరారైపోయింది. వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, సంగారెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్లు, జగిత్యాల కలెక్టర్ శరత్, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతిలను బదిలీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ రూరల్ కే బదిలీ కానున్నట్టు తెలుస్తోంది. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఆమ్రపాలినే వరంగల్ నుంచి బదిలీ కావాలని కోరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ సబ్ కలెక్టర్ గా ఆమ్రపాలి ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో కలెక్టర్ గా ప్రమోషన్ తోవరంగల్ అర్బన్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆమె ఏం చేసినా సంచలనమే. తన నిర్ణయాలతో పాలనలో మార్క్ చూపించారు. ప్రజల మనసులను గెలుచుకోగలిగారు. ఎవరు ఏం అనుకున్నా సరే తనకు నచ్చినట్టుగా తాను చేసేవారు. ఆమ్రపాలి తన పాలన విధానంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరే సంపాదించారు. వీరితో పాటు ఆరుగురు జెసీలను కూడా ప్రభుత్వం బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం ఇప్పటికే డిప్యూటి కలెక్టర్ల వివరాలు, మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే స్థానంలో పనిచేస్తున్న వారి వివరాలు పంపించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ ఏ ఆదేశించింది. పోలీసు శాఖలో కూడా బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.