విశ్వనగరం హైద్రాబాద్ మరోమారు విశ్వనరకంగా మారింది. కారణం, తక్కువ సమయంలో కురిసిన అతి భారీ వర్షమే. హైద్రాబాద్ నగరానికి వరదలు సర్వసాధారణమైపోయాయి గత కొన్నేళ్ళుగా. నిన్న కురిసిన వర్షంతో చాలా రోడ్లు జలమయమయ్యాయి. జలమయం ఏంటి.? వరదలు పోటెత్తితేనూ.? ఆ వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయ్.. మనుషులు కొట్టుకుపోయారు. హైద్రాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా మార్చేస్తున్నామని ఓ వైపు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గొప్పగా చెప్పుకుంటోంది. ఎలా.? ఇలా వరదల్లో ముంచెయ్యడం ద్వారానా.? అని నగరవాసి ప్రశ్నిస్తున్నాడు. గత పాలకులు.. అంటూ ఇన్నాళ్ళూ తప్పించుకు తిరిగిన టీఆర్ఎస్ ఇకపై తప్పించుకోవడానికి వీల్లేదు. ఏడేళ్ళ పాలనలో హైద్రాబాద్ పరిస్థితి వరదల పరంగా చూస్తే అత్యంత అధ్వాన్నంగా తయారైంది. వలస పాలనలో ఏనాడూ ఇంతలా హైద్రాబాద్ మునిగిపోయిన దాఖలాల్లేవన్నది చాలామంది అభిప్రాయం.
అయితే, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో ఏ నగరమూ సురక్షితం కాదనీ, అనూహ్యంగా కురిసే వర్షాలతో న్యూయార్క్ వంటి నగరాలే మునిగిపోతున్నాయనీ గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. పాత డ్రైనేజీ వ్యవస్థ.. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రభుత్వ వైఫల్యాలు చాలానే వున్నాయి హైద్రాబాద్ నగరం మునిగిపోవడంలో. మరీ ముఖ్యంగా చెరువుల ఆక్రమణ నగరానికి పెద్ద శాపంగా మారింది. ఆ ఆక్రమణ వెనుక రాజకీయ గద్దలుండటంతోనే.. ఈ దుస్థితి అన్నది నిపుణుల వాదన. మరి, అలాంటి రాజకీయ గద్దల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు.? అవి గులాబీ గద్దల కారణంగానేనా.? ఏమోగానీ, హైద్రాబాద్ మునక.. అనేది హైద్రాబాద్ బ్రాండ్‌ని దెబ్బతీస్తుందన్నది నిర్వివాదాంశం.