సెంటిమెంట్ ను బలంగా నమ్ముకునే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయా? లేదంటే ఏదైనా తేడా ఉన్నదా? కొంగర కలాన్ సభ, అసెంబ్లీ రద్దు తర్వాత కేసిఆర్ కు అన్నీ శుభ శకునాలేనా? అసలు కేసిఆర్ జాతకం ఎలా ఉంది. ఆయన రాశి అనుకూలతలు ఎట్లా ఉన్నాయి? డిసెంబరు 7వ తేదీన శుక్రవారం, అమావాస్య పూట ఎన్నికలు కేసిఆర్ కు లాభిస్తాయా? కీడు చేకూరుస్తాయా? జ్యోతిష్య, సంఖ్యా శాస్త్ర పండితులేమంటున్నారు? ఈ సంపూర్ణమై వివరాల కోసం స్టోరీ మొత్తం చదవండి.
తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం, సచివాలయం రాకపోవడం, బేగంపేటలో క్యాంపు ఆఫీసు ఉన్నప్పటికీ ప్రగతిభవన్ నిర్మించడం, సచివాలయాన్ని వదిలేసి కొత్త సచివాలయ నిర్మాణం కోసం ప్రయత్నించడం, చండీయాగం జరపడం లాంటివన్నీ కూడా కేసిఆర్ తను నమ్ముకున్న సెంటిమెంట్ ఆధారంగా జరిగినవే. ఇప్పటి అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు కూడా ఆయన సెంటిమెంట్ పూర్వకంగా సాగిన ప్రక్రియే. మరి కేసిఆర్ జాతకం, గ్రహాల అనుకూలతలు ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్పిన విషయాలు పరిశీలిద్దాం.
కెసిఆర్ జన్మరాశి కర్కాటకం. జన్మ నక్షత్రం ఆశ్లేష. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తేదీ సెప్టెంబరు 6 . ఆయన లక్కీ నెంబర్ ఆరు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన గణాంకాల ప్రకారం కెసిఆర్ సెప్టెంబరు 6వ తేదీన అసెంబ్లీ రద్దు చేయడానికి జాతక రీత్యా కారణాల్లోకి వెళ్దాం. సెప్టెంబరు ఆరున ఏకాదశి ఉదయం 9:12 గం.ల వరకు ఉంది. తదుపరి ద్వాదశి. అలాగే మధ్యాహ్నం 1:29 గం.ల వరకు పునర్వసు నక్షత్రం ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆరోజు మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల తర్వాత కెసిఆర్ కి బాగా కలిసొచ్చే నక్షత్రం పుష్యమి ఘడియలు మొదలవుతాయి. ఇది పరమ మైత్రి తార. ఆశ్లేష నుండి పుష్యమికి పరమ మైత్రి తార అవుతుంది. పుష్యమి నుండి ఆశ్లేషకు సంపత్తార. ఎటు చూసినా అత్యధిక పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే నక్షత్రం.
కేసిఆర్ లక్కీ నెంబర్, పరమ మైత్రి తార పుష్యమిని యాక్సెప్ట్ చేస్తూ సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం 1:30 గం.ల తర్వాత అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్ణయం వెల్లడిస్తే ఆయనకు జాతక రీత్యా కలిసొస్తుంది. ద్వాదశి తిది కొంచెం సందిగ్ధంలో ఉన్నా పరమ మైత్రి తార ఉన్నందున ఆ సమయం ఆయనకు బాగా కలిసొచ్చేదిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం 1:30 గం.ల తర్వాత వెల్లడిస్తారని వేణుస్వామి రెండు రోజుల ముందే సంచలన ప్రకటన చేశారు. ఆయన అన్నట్టుగానే మధ్యాహ్నం తర్వాతనే కెసిఆర్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్ ఏడున నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఒక చర్చ నడుస్తోంది. అదేమిటంటే డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11:59 గం.లకు అమావాస్య జొరబడి డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12:16 గంటలకు వెళ్లిపోతున్నది. సరిగ్గా డిసెంబరు 7వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే.. అమావాస్య వేళ ప్రారంభం అవుతున్నట్లే లెక్క. అందులోనూ శుక్రవారం కూడా ఉండడం జ్యోతిష్యం నమ్ముతున్న కేసిఆర్ అభిమానులను కలవరపెడుతున్న అంశంగా చెబుతున్నారు. మరి మీన మేషాలు లెక్కించి ముందుకు సాగే కెసిఆర్ కు అమావాస్య ఎలా అనుకూలిస్తుంది అన్న చర్చ నడుస్తోంది. అయితే దీనికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక లెక్క ఉంది అంటున్నారు జ్యోతిష్య పండితులు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని నగరం మండలానికి చెందిన ఒక ప్రముఖ పండితుడు ‘తెలుగురాజ్యం’కు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. కెసిఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష. అమావాస్యలో కూడా అమృత ఘడియలు ఉంటాయి. అందునా ఆశ్లేషకు అమావాస్య ఉచ్చముగా ఉంటుంది. అంటే కేసిఆర్ జాతక చక్రం ప్రకారం అమవాస్య అనేది ఆయనకు బాగా కలిసొచ్చే జాతకమే తప్ప నష్టం చేకూర్చేది కాదు. అన్నివిధాలా సానుకూలంగా, ప్రయోజనకారిగా ఉంటుంది. పైగా ఆరోజు ఉదయం 6 గంటలలోపే మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం సరస్వతి దేవి నక్షత్రం. కేసిఆర్ లాంటి జాతకం ఉన్న వారికి అత్యంత క్షేమకారిగా ఉంటుంది. అమావాస్య అయినప్పటికీ ఆశ్లేషానికి అనుకూలంగానే ఉంటుంది. తారాబలం బాగా కుదిరిన నేపథ్యంలో ఆరోజు ఎన్నికలు జరిగినా కెసిఆర్ కి నష్టం వాటిల్లే దాఖలాలు లేవు. అని ఆ పండితుడు వెల్లడించిన అంశాలు.
దీన్నిబట్టి డిసెంబరు 7వ తేదీ ఎన్నికలు జరిగినా కేసిఆర్ కానీ, ఆయన అభిమానులు (సెంటిమెంట్స్ ను నమ్మే వారు) పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నది తేలిపోయింది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, గ్రహ స్థితిగతులు, రాశులు వాటి పరిణామాలు అన్నీ నమ్ముకుని చేసిన కొన్ని కార్యాలు కూడా ఆచరణలో అట్టర్ ఫ్లాఫ్ అయిన దాఖలాలు ఉన్నాయి. కేసిఆర్ రాజకీయ జీవితంలో టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ నెలకొల్పే వరకు ఒక ఘట్టం కాగా టిఆర్ఎస్ స్థాపన తర్వాత ఒక ఘట్టంగా అనుకోవచ్చు. అలాగే తెలంగాణ సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అనేది మరో ఘట్టంగా విభజిస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో టిఆర్ఎస్ స్థాపన తర్వాత తెలంగాణ వచ్చే వరకు మధ్యలో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి.
ఒక సమయంలో సెంటిమెంట్లు అన్నీ ఫాలో అయినా కూడా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికలకు పోయి 16 సీట్లలో పోటీ చేసి 9 సీట్లలో గెలిచిన గడ్డు రోజులు కూడా ఈ జాతకాలు, నమ్మకాల ఆధారంగా జరిగినవే. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడం కూడా జరిగింది. మరి ఆనాడు ఇవే ముహూర్త బలాలు ఎందుకు లాభించలేదు అన్న చర్చ కూడా ఉంది. రేపు వందకు వంద శాతం ఈ ముహూర్త బలాలు, సెంటిమెంట్లు, నమ్మకాలు కలిసొస్తాయా అంటే ఏ పండితుడు కూడా 100 పర్సెంట్ ఇదే నిక్కం అని ముందుకొచ్చి చెప్పలేని పరిస్థితే ఉంది. మరికొద్ది గంటలు వేచి చూద్దాం… ఏం జరుగుతుందో…?
ఎన్నికల వేళ యాగాలు పూజలు :
ఎన్నికల ప్రచారం హోరెత్తిన సమయంలోనూ కేసిఆర్ తన నమ్మకాల ప్రకారమే సాగారు. ఒకవైపు ప్రచార హోరులో ఉంటూనే మరోవైపు తన ఫామ్ హౌస్ లో యాగం చేశారు. ఒకసారి చిర్నజీయార్ స్వామి ఆధ్యాత్మిక కేంద్రం వెళ్లి అక్కడ జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిన్న జీయార్ స్వామికి సాష్టాంగ ప్రమాణం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.