గులాబీ దళపతి కేసిఆర్ జాతకం మామూలుగా లేదుగా

2018 తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కేసిఆర్ చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గుణాత్మక మార్పు తీసుకొస్తామని ప్రకటించిన వేళ ఆయన ఒక్కసారిగా నేషనల్ ఫిగర్ గా మారిపోయారు. సౌత్ ఇండియన్ లీడర్స్ అగ్ర నేతల జాబితాలో చేరిపోయారు.

ఈ నేపథ్యంలో అసలు కేసిఆర్ తొడగొట్టి మరీ ముందస్తు ఎన్నికలకు పోయి ఇంతటి ఘనవిజయం ఎలా సాధించారన్న చర్చోప చర్చలు సాగుతున్నాయి. అయితే కేసిఆర్ నమ్మకాలు, విశ్వాసాలు సైతం ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా కేసిఆర్ జాతకం మామూలుగా లేదని ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కు చెందిన జ్యోతిష్య పండితుడు మాండ్రు నారాయణ రమణారావు చెబుతున్నారు. ఆయన చెప్పిన పూర్తి వివరాలేంటో చదవండి.

తెలంగాణ సిఎం కేసిఆర్ ది విక్రమార్క జాతకం అని రమణారావు అన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తిరిగి కేసిఆర్ గెలుస్తాడని తాను చెప్పానని అదే జరిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో కేసిఆర్ కొన్ని దైవ ప్రక్రియలు నిర్వహిస్తే భవిష్యత్  ప్రధాని ఆయనే అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. కేసిఆర్ కు ఉన్న విక్రమార్క జాతకం వంద కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుందన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోశించే అవకాశాలున్నాయన్నారు.

ప్రస్తుతం కేసిఆర్ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దీనికితోడు చంద్రడు, రాహువు, కేతువు స్థానాలు అనుకూల యోగాన్ని చూపుతున్నట్లు చెప్పారు. అందుకే కేసిఆర్ పట్టిందల్లా మహాయోగం లోకి వెళ్తుందని చెప్పారు. 2009లో తాను తెలంగాణ భవన్ లో నిర్వహించిన అపూర్వ చండీయాగం కేసిఆర్ కు రాజయోగంగా మారిందని వివరించారు. కేసిఆర్ ఏ ఎన్నికలకు వెళ్లినా గతంలో ఉన్న సీట్ల కంటే అధికంగా గెలిచే చాన్స్ ఉందన్నారు. 

కానీ ఆ జాగ్రత్త తప్పదు

కేసిఆర్ కు ఎంతటి అరుదైన జాతకం ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం పండితులు రమణారావు హెచ్చరించారు. కేసిఆర్ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెలిక్యాప్టర్ ప్రయాణాల విషయంలో ఆయన అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ సిఎం కేసిఆర్ ఎక్కడికి వెళ్లినా ఈ మధ్య హెలిక్యాప్టర్ నే వాడుతున్నారు. ఎన్నికల సమయంలో సుమారు 100 సభల్లో ఆయన పాల్గొన్న వేళ ప్రతి సభకు హెలిక్యాప్టర్ నే వినియోగించారు. చివరకు ఓటు వేసే సమయంలోనూ ఆయన ఫఆమ్ హౌస్ నుంచి చింతమడకకు హెలిక్యాప్టర్ లోనేే వెళ్లారు. ఇకపై ఈ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచించారు.

2019 పార్లమెంటు ఎన్నికలు కేసిఆర్ కు మరో మైలు రాయి అందుకునేందుకు వేదికగా మారనున్నాయా అన్న ఆసక్తి రమణారావు కామెంట్స్ ను బట్టి రేగుతున్నది. ప్రధాని అయ్యే అవకాశాలు కేసిఆర్ కు జాతకరిత్యా ఉన్నాయన్న సంకేతాలు ఆయన ఇచ్చారు. పరిస్థితులు చూస్తుంటే కేసిఆర్ కూడా ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు కనబడుతున్నది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి పార్టీలను ఏకం చేయబోతున్నట్లు ప్రకటించారు. దేశంలో ఉన్న మైనార్టీలందరినీ ఏకం చేస్తానని, అందుకోసం అసదుద్దీన్ ఓవైసి సహకారం తీసుకుంటానని కూడా చెప్పారు.