హరీష్ రావు సంచలన నిర్ణయం… పదవికి రాజీనామా

గత కొంత కాలంగా హరీష్ రావు చర్చల్లో నిలుస్తున్నాడు. పార్టీలో హారీష్ రావు ప్రాధాన్యత తగ్గిందన్న చర్చ జరుగుతోంది. అయితే హారీష్ రావుకు చెక్ పెట్టేందుకే కేటిఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారన్న చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా హారీష్ రావు లక్ష ఓట్ల మెజార్టీతో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి మంత్రి వర్గంలో ఆయనకు బెర్తు ఖాయమని తెలుస్తోంది. ఈ తరుణంలో హారీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసిలోని ప్రధాన యూనియన్ టిఎంయూ గౌరవాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది.

గురువారం టిఎంయూ గౌరవాధ్యక్ష పదవికి హారీష్ రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి పంపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఒక ప్రత్యేక యూనియన్ ఉండాలనే ఉద్దేశ్యంతో టిఎంయూను ఏర్పాటు చేశారు. అప్పటికే కార్మిక రంగం పట్ల అవగాహన ఉన్న హారీష్ రావు  యూనియన్ ను బలోపేతం చేసేందుకు గౌరవాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి వరించడంతో యూనియన్ కు పూర్తి స్థాయిలో ఆయన సమయం కేటాయించలేకపోయారు. అయితే హారీష్ రావు లేఖ ఇంకా తమకు అందలేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 

టిఎంయూ హరీష్ రావుకు తెలియకుండా తమ వేతనాలు పెంచాలని సమ్మె నోటిసులు ఇచ్చారు. సంస్థలో గుర్తింపు పొందిన సంస్థే నోటిసులు ఇవ్వడంతో మిగిలిన సంఘాలు కూడా సమ్మె నోటిసులు ఇచ్చాయి. ఇలా సమ్మె సూచనలు తీవ్రం కావడంతో సీఎం కేసీఆర్ యూనియన్ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రం ఇవ్వని బెనిఫిట్స్ ఇచ్చినా ఈ విధంగా ప్రవర్తిస్తారా అని కేసీఆర్ గరం గరం అయ్యారు. అవసరమైతే ఆర్టీసిని ప్రైవేటు పరం చేస్తానని హెచ్చరించారు. అటు కేసీఆర్ ఆగ్రహం కావడం, యూనియన్ నేతలు తనకు చెప్పకుండా ఇవ్వడం హారీష్ రావును ఇరకాటంలో పడేశాయి. చివరకు ప్రభుత్వం నియమించిన కేబినేట్ కమిటిలో 16 శాతం ఐఆర్ ను ప్రకటించి వారు సమ్మెకు వెళ్లకుండా కీలక పాత్ర పోషించారు. అప్పుడే హారీష్ రావు కార్మిక నేతల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అప్పుడే రాజీనామా చేస్తారన్న చర్చ జరిగింది. ఈ వ్యవహారం జరిగినప్పటి నుంచే కేసీఆర్, హారీష్ రావుల మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. 

తెలంగాణ కేబినేట్ విస్తరణ జరిగే సమయంలో హారీష్ రావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది. ఇన్ని రోజులు లేనిది హారీష్ రావు ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా హారీష్ రావుకు సరైన ప్రాధాన్యత లేదన్న వాదన వినిపిస్తోంది. ఆ క్రమంలోనే మనస్సు నొచ్చుకొని తన పదవికి హారీష్ రాజీనామా చేశారని కార్యకర్తలు అంటున్నారు. పూర్తి సమయం కేటాయించలేకపోవడం వల్లే హారీష్ రావు రాజీనామా చేశారని మరికొందరంటున్నారు. మరి హారీష్ రావు నోరు విప్పితే కానీ అసలు విషయాలు తెలియవు.  దీని పై హారీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.