గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. హైదరాబాద్ వరదలు, దుబ్బాకలో బీజేపీ గెలుపు లాంటి పలు కీలక అంశాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ శుక్రవారం అనగా రేపు కౌంటింగ్ ఫలితాలు వెలువడనుండగా ఓటర్లు ఎగ్జిట్ పోల్స్ సర్వేల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓల్డ్ మలక్ పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించేందుకు అనుమతి లేకపోవడంతో డిసెంబర్ 1 సాయంత్రం వెల్లడి కావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను తాజాగా వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు కొంత షాకింగానే ఉన్నాయి. ప్రధానంగా అధికార పార్టీ తెరాస ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి.
గత గ్రేటర్ ఎన్నికల్లో 99 సీట్లు పొందిన తెరాస ఈసారి 100 సీట్లతో సెంచరీ కొట్టాలని ఆశపడింది. కేసీఆర్ సైతం 100 సాధిస్తామనే ధీమాతో ఉండేవారు. కానీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు పరిస్థితులు తారుమారయ్యాయి. వాటి ప్రభావం ఫలితాల మీద తప్పకుండా కనిపించనుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఆ విషయాన్నే చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నందు టీఆర్‌ఎస్ 68-78 సీట్లు, ఎంఐఎం 38-42, బీజేపీ 25-35, కాంగ్రెస్ 1-5 స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
ఇక సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ నందు తెరాస 82-96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3 – 5 స్థానాలు కైవసం చేసుకోవచ్చని ఫలితాలు రాగా హెచ్‌ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్ 65 నుండి 70, ఎంఐఎం 35 నుండి 40, బీజేపీ 27 నుండి 31, కాంగ్రెస్ 3 నుండి 6 స్థానాలు కైవసం చేసుకువే అవకాశం ఉన్నట్టు తేలింది. ఒక్క థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మాత్రమే తెరాస 95 నుండి 101 స్థానాలు పొందుతుందని, ఎంఐఎం 35 నుండి 38, బీజేపీ 5 నుండి 12, కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితం కావొచ్చని ప్రిడిక్షన్స్ వచ్చాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం టిఆర్ఎస్ 100 మార్క్ అందుకోవడం కష్టమ ని,బీజేపీ గతంతో పోలిస్తే బలపడిందని చెబుతున్నాయి. మరి వీటిలో ఏ ఫలితాలు నిజమవుతాయో చూడాలి.