షర్మిల, విజయమ్మ అలా.! అవినాష్ రెడ్డి ఇలా.!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఈ రోజు సీబీఐ యెదుట విచారణ కావాల్సి వుండగా, అది కాస్తా రేపటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కాగా, నిన్నే అవినాష్ పీఏ సహా, అవినాష్ తండ్రిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అవినాష్ రెడ్డి కూడా అరెస్టవుతారన్న ప్రచారం జరిగింది కానీ, అలాంటిదేమీ జరగలేదు.

ఇదిలా వుంటే, విజయమ్మ పార్టీని వీడటం.. షర్మిల సైతం వైసీపీకి దూరంగా వుండడం.. అప్పట్లో ఆ ఇద్దరి విషయంలో వైఎస్ జగన్ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది.

వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన క్రమంలో ఆమె మీద కొందరు వైసీపీ మద్దతుదారులు ట్రోలింగ్‌కి దిగారు. కానీ, హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటోంటే, వైసీపీలో అంతా ఆయనకు మద్దతిస్తున్నారు. సొంత తల్లి, చెల్లి విషయంలో వైఎస్ జగన్ తీరు ఒకలా వుంది, వరుసకి సోదరుడయ్యే అవినాష్ విషయంలో వైఎస్ జగన్ తీరు మరోలా వుందంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది.

పార్టీకి చెందిన నేతని కాపాడుకునేందుకు వైసీపీ శాయశక్తులా కృషి చేస్తుండడాన్ని ఎలా తప్పు పట్టగలం.? అన్నది ఓ వాదన. ఎవరి గోల వారిది.! అవినాష్ రెడ్డి విషయంలో మరీ ఇంతలా వైసీపీ వ్యవహరించడమేంటి.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది.