ఎన్నికల సమరోత్సాహంతో ఉన్నది తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా పార్టీ అధినేత కేసిఆర్ నడిపిస్తున్నారు. సెప్టెంబరు 2 ప్రగతి నివేదన సభ తర్వాత పూర్తిగా పార్టీ యంత్రాంగమంతా ఎన్నికల మీదే దృష్టి సారించే చాన్స్ ఉంది. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వచ్చి పార్టీలో పని చేసేవారు ఉద్యమ బ్యాచ్ గా చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లో చేరిన వారంతా బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరినట్లు చెప్పుకోవడంతో వారందరినీ బిటి బ్యాచ్ గా పిలుస్తుంటారు. అప్పుడప్పుడు ఈ రెండు బ్యాచ్ ల మధ్య అంతర్గత పోరు కూడా సాగిన దాఖలాలు ఉన్నాయి.
ఇక తెలంగాణ వచ్చిన తర్వాత చాలా రోజులకు మాజీ మంత్రి, హైదరాబాద్ సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరారు. ఆయన ఎప్పుడో టిఆర్ఎస్ లో చేరతారని ప్రచారం సాగింది. కానీ అది వాయిదా పడుతూ పడుతూ ఇప్పుడు నెరవేరింది. అంతిమంగా ఆయన కారు ఎక్కేశారు. కానీ టిఆర్ఎస్ పార్టీలో పెద్దగా వాడుకలో లేని కొత్త కల్చర్ ను దానం నాగేందర్ ఆరంభించారని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది కాంగ్రెస్ పార్టీలో బాగా వాడుకలో ఉన్న కల్చర్. ఇంతకూ ఆ కల్చర్ ఏందబ్బా అనుకుంటున్నారా? చదవండి.
దానం నాగేందర్ శనివారం మధ్యాహ్నం 3గంటలకు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి నివేదన సభకు ఏర్పాట్ల విషయంతో పాటు ఇతర అంశాలపైనా ఆయన మీడియాతో మాట్లాడే చాన్స్ ఉంది. ఆయన టిఆర్ఎస్ లో చేరిన తర్వాత పలు సందర్భాల్లో పార్టీ ఆఫీసులోనే మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇలా పార్టీ నేతలెవరూ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు పెద్దగా లేవు. గతంలో ఎంపీగా ఉన్న విజయశాంతి పలు సందర్భాల్లో తన నివాసంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అది కూడా అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే. ఇక డిఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఒకటి అరా సందర్భాల్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి తలసాని పార్టీ మారిన సమయంలో ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత కూడా ఒకటి అర సందర్భాల్లో మాత్రమే ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. కానీ మిగతా లీడర్లు ఎవరైనా పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఇండ్ల వద్ద పెట్టలేదు. ఎంపి కవిత కూడా చాలా సందర్భాల్లో తన నివాసంలో మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ ప్రెస్ మీట్ మాత్రం జరపలేదు. ఒకటి రెండు సందర్భాల్లో సీనియర్ నేత కేశవ రావు కూడా ఇంటివద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ విరాజిల్లుతూ ఉన్నది. ఆ పార్టీలో చాలా మంది నేతలు ఇంటివద్ద ప్రెస్ మీట్ పెడతారు. సొంత పార్టీ నేతలపైనా విమర్శల వర్షం కురిపిస్తుంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా ఇండ్ల వద్ద జరిగిన మీడియా సమావేశాల్లోనే విసురుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంతర్గత ప్రజా సామ్యానికి పెట్టింది పేరు గా కాంగ్రెస్ ను అంటుంటారు. అందుకే ఆ పార్టీలో ఎవరిని ఎవరైనా విమర్శలు చేస్తారు. కానీ టిఆర్ఎస్ లో ఏది మాట్లాడాలన్నా పార్టీ అధినేత ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది. అంతేకాదు టిడిపిలో కూడా అదే కల్చర్ ఉంది. మరి ఇప్పుడు తొలిసారి మధ్యాహ్నం 3గంటలకు తన నివాసంలో దానం నాగేందర్ మీడియా సమావేశం ఉందంటూ మీడియా ప్రతినిధులకు మెసేజ్ లు అందే సరికే మీడియ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కల్చర్ టిఆర్ఎస్ లో కూడా షురూ అయితున్నదా అంటూ కొందరు మీడియా రిపోర్టర్లు సెటైర్లు వేసుకుంటున్నారు.