నల్లగొండ టిఆర్ఎస్ పార్టీలో కోవర్టుల కలకలం

టిఆర్ఎస్ పార్టీలో కోవర్టుల భయం పట్టుకుంది. స్వంత పార్టీ నేతల వెన్నుపోటుతోనే 3 స్థానాల్లో ఓడిపోయామని నేతలు భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 12 శాసనసభ స్థానాల్లో టిఆర్ఎస్ 9 కైవసం చేసుకుంది. కానీ కొన్ని ప్రాంతాలలో నేతల తప్పిదంతో మెజార్టీ తగ్గిందని, పార్టీలోని వారే కోవర్టులుగా పని చేసి ప్రత్యర్దులుగా బలం చేకూర్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు నల్లగొండలో హాట్ టాపికయ్యాయి.

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి నోముల నర్సింహ్మయ్య బరిలో దిగారు. అక్కడ ఎన్నికల బాధ్యతలను పార్టీలోని కీలక నేతకు అప్పగించారు. ఖర్చు నిమిత్తం పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా అతని వద్దే ఉంది. అయితే అతను నోముల అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాడని తేలింది. దీంతో పార్టీ నాయకత్వం అతని నుంచి బాధ్యతల నుంచి తప్పించి ఎమ్మెల్సీ కర్నె ప్రబాకర్ కు బాధ్యతలిచ్చారు.

డబ్బు విషయాన్ని కూడా కర్నె కు అప్పగించగా డబ్బుల విషయం వద్దని కర్నె అన్నారట. దీంతో ఆ నాయకునికే డబ్బుల బాధ్యత, ఎన్నికల ఖర్చు బాధ్యత అప్పగించారు. జానారెడ్డి సాగర్ నుంచి 8వ సారి గెలవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ నోముల గట్టి పోటినివ్వడంతో జానా ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాత చేసిన లెక్కలల్లో 50 లక్షల రూపాయల తేడా వస్తుందట. ఆ నేతే చేతివాటం ప్రదర్శించారని తేలిందని తెలుస్తోంది. అతని పై చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు ఇప్పటికే గులాబీ బాస్ కు సమాచారమందించారని తెలుస్తోంది. హూజుర్ నగర్ లో కూడా సైదిరెడ్డి అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన కొందరు ఆయనకు వ్యతిరేకంగా పని చేశారని తేలిందట.

నకిరేకల్ అభ్యర్ది వేముల వీరేషం ఓటమిపాలయ్యారు. నకిరేకల్ లో స్వంత పార్టీ నేతలే కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేశారని నేతల విశ్లేషణలో తేలిందట. ట్రక్ గుర్తు ద్వారే ఓటమిపాలయ్యామనే అభిప్రాయానికి వచ్చినా దానికంటే ఎక్కువ స్వంతపార్టీ వారి వల్ల మోసం జరిగిందని గ్రహించారట. నాగార్జునసాగర్‌ లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా, అక్కడా ట్రక్‌ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ మెజారిటీ తగ్గింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్‌ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ నకిరేకల్‌ నియోజకవర్గంలో ట్రక్‌ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ వల్లే ఓటమి పాలయినట్టు తేలిందట.

మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్‌ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.