తెలంగాణలో రాజకీయ వేడి రగిలించిన అంశం తెలంగాణ శాసనమండలి. శాసనమండలిలో కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు టిఆర్ఎస్ విసిరిన పాచిక ఫలించింది. మార్చి నెల తర్వాత తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుంది. దానికి ఇవాళ ముహూర్తం పెట్టేసింది టిఆర్ఎస్ పార్టీ. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికార పార్టీ అంటే ఎక్కువ సమానం, ప్రతిపక్ష పార్టీ అంటే తక్కువ సమానం అన్న సిద్ధాంతాన్ని స్వామి గౌడ్ ఫాలో అయినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శాసనమండలిలో పరిణామాలు వేగంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు శానసమండలి సభ్యులు తమను టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ శుక్రవారం ఉదయం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చారు. తాము సిఎల్పీ సమావేశం జరిపామని, ఆ సమావేశంలో తామంతా టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కోరుతూ నిర్ణయం తీసుకున్నామని లేఖను స్వామి గౌడ్ కు అందించారు.
ఈ పరిణామం జరిగిన వెంటనే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ ఇద్దరూ వెళ్లి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలిశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను ఏండ్ల తరబడి పెండింగ్ లో పెట్టి టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న నిర్ణయాలను మాత్రం వేగంగా తీసుకుంటున్నారని ఆక్షేపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మీద అనర్హత వేటు వేయాలని కోరిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. శాసనమండలి గౌరవాన్ని కాపాడాలని విన్నవించారు.
అయితే రెండు పార్టీల అభ్యంతరాలను, లేఖలను స్వీకరించిన ఛైర్మన్ దీనిపై నిర్ణయాన్ని తీసుకున్నారు. అందరూ ఊహించిన నిర్ణయమే జరిగిపోయింది. శాసనమండలిలో టిఆర్ఎస్ శాసనసభా పక్షం లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం చేయాలని నలుగురు ఎమ్మెల్సీలు (ఆకుల లలిత, ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి) ఇచ్చిన తీర్మానాన్ని ఛైర్మన్ ఆమోదించారు. వారి విలీనాన్ని గుర్తిస్తూ నిర్ణయం వెలువరించారు. ఈమేరకు శాసనమండలి బులెటిన్ రిలీజ్ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహ్మాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. ఇక నుంచి ఎంఎస్ ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్ ఈ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు.
ఇక శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దు అయినట్లేనని చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలిలో ఉన్నారు. ఒకరు షబ్బీర్ అలీ, ఇంకొకరు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే. వీరిద్దరి పదవీ కాలం మార్చిలో ముగిసిపోనుంది. మార్చి తర్వాత కాంగ్రెస్ సభ్యత్వం మండలిలో ఉండడం అనమానంగానే ఉందని చెప్పవచ్చు. తమ అభ్యర్థనను పట్టించుకోవాలని మండలి ఛైర్మన్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు కోరినప్పటికీ వారి అభ్యర్థన అరణ్యరోదన గానే మిగిలిపోయింది.