తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా? అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలను ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్న దుబ్బాక ఎన్నికల్లో అదే జరిగింది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి రెండంటే రెండే సీట్లు వచ్చాయి. దీంతో తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
అయితే… గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే… టీపీసీసీ పదవికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కోరారు.
ఆయన రాజీనామాను హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? ఒకవేళ ఆమోదిస్తే నెక్స్ ట్ టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
టీపీసీసీ చీఫ్ గా మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరోవైపు ఎంపీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కాస్తో కూస్తో మాట్లాడే సత్తా ఉన్న నాయకుడంటే రేవంత్ రెడ్డే.
అందుకే.. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మీదే ఆశలు పెట్టుకుందట. ఈనెల 9న అంటే సోనియా గాంధీ పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
ఓవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ నేపథ్యంలో కనీసం తెలంగాణలో అయినా పార్టీ పునరుజ్జీవం కావాలి. వచ్చే ఎన్నికల సమయానికైనా పార్టీ పుంజుకుంటే ఓకే కానీ.. లేదంటే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల తాకిడి తట్టుకోవడం కష్టమే?