కొండగట్టు బస్సు ప్రమాద స్థలికి అఖిల పక్ష నేతలు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి విహెచ్, టిడిపి నుంచి రమణ, ఇతర పార్టీల నేతలు వెళ్లారు. ప్రమాద స్థలిని చూసి నేతలు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత వీహెచ్ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీకు ఎన్నికలు ముఖ్యమారా బై… కొండగట్టుకు వచ్చి బాధితులను పరామర్శించే టైం లేదారా బాబు.. అంటూ కేసీఆర్ ను వీహెచ్ ప్రశ్నించారు. కొండగట్టును తిరుపతి చేస్తా అన్నావు.. నీ మాటలేమైనయి కేసీఆర్ అని విమర్శించారు. సానియా మీర్జా, పీవీ సింధులకు అయితే పిలిచి మరీ కోట్ల రూపాయలు ఇస్తావు.. మరీ ఈ కొండగట్టు బాధితులు ఏం పాపం చేశారని పరామర్శకు రాలేదని నిలదీశారు. హాస్పిటల్ లో కాళ్లు చేతులు విరిగి ప్రజలు అరిగొస పడుతుంటే వారి గోస నీకు వినబడుతలేదా ముఖ్యమంత్రి .. ప్రగతి భవన్ ల ఎట్లుండబుద్ది అయితుందిరా నాయనా అంటూ వీహెచ్ కేసీఆర్ పై మండిపడ్డాడు. ఈ ప్రమాదం పై రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా కేసును పెట్టాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని తెదేపా నేత రమణ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని, ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా మంత్రి , ఆర్టీసి చైర్మన్ లు తక్షణమే రాజీనామా చేయాలని రమణ డిమాండ్ చేశారు.