గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసియార్ మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆత్మాహుతికి పాల్పడ్డారు. పోలీసులు తనను వేధిస్తున్నారని, తన ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. దీనితో ఒంటేరు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తనను, తన అభిమానులను బెదిరించి దొంగ కేసులలో ఇరికించే కుట్ర జరుగుతూ ఉందని ఒంటేరు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒంటేరు ప్రతాప్ రెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి కొంపల్లిలో తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆయన ఇంట్లో భారీగా మద్యం, డబ్బు ఉన్నట్టు ఎన్నికల అధికారులకు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీని పై ఎన్నికల అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలతో పోలీసులు ఒంటేరు విజయ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరని, ఇంట్లో డబ్బులు, మద్యం లేవని వారు చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఇంట్లోకి వచ్చి ఇళ్లంతా సోదాలు నిర్వహించారు.
ఈ లోపు విషయం తెలుసుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు తమను ఎందుకు వేదిస్తున్నారంటూ ప్రశ్నించారు. తమ ఇళ్లలో డబ్బులు లేవని నాలుగు రోజులుగా పోలీసులు పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున పోలీసులే స్వయంగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని.. ఇప్పటికే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని,అయితే, దీన్ని తన మీదకు తోసేందుకు కుట్ర జరుగుతూ ఉందని ఆయన అరోపిస్తున్నారు.
ఒంటేరు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి భారీ ఎత్తున చేరుకొని ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసి ఒంటేరు తన ఒంటి పై పోసుకున్నారు. దీంతో కార్యకర్తలు ఆందోళన చెందారు. ఒంటేరు ఆత్మా హుతి యత్నంతో పోలీసులు, కార్యకర్తలు అలర్ట్ అయ్యి ఆయనను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి మీద పోటీచేస్తున్నాని, తాను గెలుస్తానని తెలిసి గజ్వేల్ లో పోలీసులు ఇలా తనను వేదిస్తున్నారంటూ ఆర్ వో కార్యాలయం ముందు ఒంటేరు ఆందోళన చేపట్టారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం విడుదల చేశారు.
ఇపుడు ఒంటేరు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు మరోసారి ఆయనను అరెస్ట్ చేశారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకే తాము సోదాలు చేశామని, దీనికి కార్యకర్తలు అడ్డుపడడం కరెక్ట్ కాదని డిసిపి పద్మజ తెలిపారు. ఒంటేరు ఇంట్లో ఎటువంటి నగదు, మద్యం దొరకలేదని పోలీసులు తెలిపారు.
గజ్వేల్‌లో పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసతో కుమ్మక్కయ్యారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సీఈవోను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అధికారుల తీరు మారకపోతే తాను గజ్వేల్ ఆర్‌వో కార్యాలయం ముందే ఆత్మబలిదానం చేసుకుంటానని హెచ్చరించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, సివిల్ పోలీసులతో నిఘా పెట్టించి తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున పోలీసులే స్వయంగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని.. ఇప్పటికే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో హరీశ్‌రావు కాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో డబ్బులున్నాయని చెబుతున్నా పోలీసులు తనిఖీ చేయడం లేదన్నారు. ఒంటేరు ఆత్మహత్యాయత్నానికి ిపాల్పడ్డ వీడియో కింద ఉంది చూడండి.