ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు చిక్కులు ఎదురు కాబోతున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో కేసీఆర్ కు హారీష్ రావుకు మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ జగ్గారెడ్డికి, హారీష్ రావుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా విబేధాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో జగ్గారెడ్డి కేసీఆర్, కేటిఆర్ లను పొగుడుతూ హరీష్ రావును విమర్శిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జగ్గారెడ్డిని ఓడగొట్టడానికి హారీష్ రావు తీవ్ర ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం అన్నింటికి ఎదురొడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు. పాత కేసులు తిరగదోడి అరెస్టు చేయించడం వెనుక హరీష్ పాత్ర ఉందని జగ్గారెడ్డి నమ్ముతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఇంకా విబేధాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటిఆర్ లపై తాను ఎటువంటి విమర్శలు చేయనన్నారు.
అయితే ఇటీవల కాలంలో జగ్గారెడ్డి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు కొత్త రాజకీయ కోణం కోసం ఆలోచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి కేసీఆర్ కు అర్థం కావడం లేదని హరీష్ తో ముప్పు తప్పదని జగ్గారెడ్డి అన్నారు. దీంతో ఒక్క సారిగా టిఆర్ఎస్ లో కలకలం రేగింది.
జగ్గారెడ్డి సరికొత్త ప్లాన్ వేస్తున్నారని ప్లాన్ ప్రకారమే జగ్గారెడ్డి హరీష్ రావు పై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డి గులాబీ గూటికి చేరేందుకు సిద్దమైతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే హరీష్ పై బాణాలు ఎక్కు పెడుతూ కేసీఆర్ కు దగ్గరయ్యేలా ప్లాన్ వేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, కేసుల దృష్ట్యా టిఆర్ఎస్ గూటికి చేరుతేనే మంచిదనే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇలా హరీష్ పై విమర్శలు చేసి కేసీఆర్ కు దగ్గరయ్యి గులాబీ కండువా కప్పుకుంటారని నేతల ద్వారా తెలుస్తోంది.
జగ్గారెడ్డి కాంగ్రెస్ లో చేరితే హరీష్ రావుకు కొరకరాని కొయ్యగా మారుతారని నేతలు చర్చించుకుంటున్నారు. బద్ద శత్రువులుగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కేసీఆర్ మిత్రులయ్యారు. అలాగే హరీష్ రావు , జగ్గారెడ్డి మిత్రులవుతారా లేక శత్రువులుగానే ఉంటార అనేది చూడాలి.