ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న వేళ టిఆర్ ఎస్ పార్టీ తన ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా మాజీ స్పీకర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డిని టిఆర్ ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు టిఆర్ ఎస్ పార్టీ చర్చలు జరిపింది. అందులో భాగంగానే మంత్రి కేటిఆర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం చర్చలు జరిపారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ కు పెద్ద షాక్ గా టిఆర్ ఎస్ నేతలు అంటున్నారు. కేటిఆర్ ఆహ్వనంతో సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ లోకి వెళ్లేందుకు అంగీకరించారు.
దీంతో సురేష్ రెడ్డి టిఆర్ ఎస్ పార్టీలో చేరడం లాంఛనమైంది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సురేష్ రెడ్డి 1989 నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. 2004లో 12 వ శాసనసభకు స్పీకర్ గా పనిచేశారు. 2009లో ఆర్మూర్ నుంచి పోటి చేసి సురేష్ రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి ని అభ్యర్ధిగా ప్రకటించడంతో సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ మొదలైంది.
సురేష్ రెడ్డికి మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. రాజకీయ కారణాలతో పార్టీలో చేరటం లేదని, అభివృద్దిలో పాలు పంచుకోవడానికే పార్టీలో చేరుతున్నట్టు సురేష్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు 1989 నుంచి మంచి మిత్రులని సురేష్ రెడ్డి అన్నారు. మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా టిఆర్ ఎస్ లోకి వస్తారని సురేష్ రెడ్డి తెలిపారు.
సురేష్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన మరికొంత మంది సీనియర్ నేతలతోను టిఆర్ ఎస్ పార్టీ ముఖ్యులు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. టిఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కరి చేయాలని ప్రణాళిక వేసినట్టుగా తెలుస్తోంది. టిఆర్ ఎస్ నేతలతో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.