నాగార్జున సాగర్ లో ఓటమిపాలైన జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న లాంటోడు. తెలుగు నేల మీద అందరికంటే ఎక్కువగా మంత్రివర్గంలో ఉన్న నాయకుడు. తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ నేతల చేత కూడా గౌరవించబడ్డ నాయకుడు. ఆయనెవరో కాదు కుందూరు జానారెడ్డి. రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నవేళ జానారెడ్డి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. మాజీ కమ్యూనిస్టు యోధుడు నోముల నర్సింహ్మయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చవిచూశారు.

నల్లగొండ జిల్లాలో చరిత్ర కగిగిన రాజకీయ నాయకుల జాబితాలో జానారెడ్డి ఒకరు. జానారెడ్డికి సమకాలీకులు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి లాంటివాళ్లు ఇప్పుడు జీవించి లేరు. నల్లగొండ జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నేత నర్రా రాఘవరెడ్డి కూడా జీవించి లేరు. జానారెడ్డి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించలేకపోయిన నోముల నర్సింహ్మయ్య ఈసారి జనారెడ్డి మీద గెలిచారు.

టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య చేతిలో 9,368 ఓట్ల తేడాతో జనారెడ్డి ఓడిపోయారు. ఈసారి నాగార్జునసాగర్ లో జానా కచ్చితంగా గెలుస్తారని భావించినప్పటికీ, నియోజకవర్గం ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో నోముల మీద మరో యాదవ అభ్యర్థి పోటీలో ఉన్న కారణంగా జానారెడ్డి గెలుపొందారు. కానీ ఈసారి నోమల గెలుపు ను ఏరకంగా జానా నిలువరించలేకపోయారు. 

ఇప్పుడు తేలాల్సింది. జానారెడ్డి రాజకీయాల్లో ఇంకా కొనసాగుతారా? లేదంటే తన కొడుకు  రఘువీర్ రెడ్డిని పూర్తి కాలం రాజకీయాల్లో క్రియాశీలం చేసి ఆయన రెస్ట్ తీసుకుంటారా అన్నది తేలాలి. జానారెడ్డి తెలుగు నేల మీద అత్యధిక కాలం మంత్రివర్గంలో కొనసాగినా.. ఒక కోరిక మాత్రం తీరలేదు ఆయన ఎక్కువ కాలం కేబినెట్ లో ఉన్నప్పటికీ సిఎం కాలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పెత్తనం ఉండడం వల్ల జానారెడ్డి మంత్రి పదవికే పరిమితం అయిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జానారెడ్డికి సిఎం అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ టిఆర్ఎస్ బలోపేతం కావడంతో జానా ఇక ఆ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.

జానారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనూ మంత్రిగా ఉన్నారు. రామారావు మంత్రివర్గంలో పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయమంతా జానారెడ్డి మంత్రిగా పనిచేశారు.