తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అధికార కాంగ్రెస్ పార్టీలో బాహ్యంగా నిశ్శబ్దం కొనసాగుతుండగా, లోపల మాత్రం తీవ్ర లాబీయింగ్ సాగుతోందనే టాక్ వస్తోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోగా, మాజీ స్పీకర్ జానారెడ్డి మాత్రం ఒక్క లేఖతోనే ఆయన్ను పక్కకు నెట్టేశారనే చర్చ తెరపైకి వచ్చింది. మంత్రిగా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న నేపథ్యంలో, అదే కుటుంబానికి మరో మినిస్టర్ బెర్త్ ఇవ్వాలా? అనే డిబేట్ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.
ఈ లెక్కల్లోకి మరింత మసాలా కలిపిందేంటంటే.. జానారెడ్డి రాసిన లేఖ. స్వయంగా నల్గొండ జిల్లాకు చెందిన నేతగా ఉన్నా.. రాంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన ఆయన ఉద్దేశంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం సమ ప్రాంతాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతోనా? లేక తన కుమారుల భవిష్యత్తు రాజకీయ లెక్కలతోనా అనే ప్రశ్నలు ఊగిపోతున్నాయి.
కేంద్రంగా మారిన ఈ లేఖపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందిస్తూ.. ఇదంతా చానాక్షి రాజకీయం అని ఎద్దేవా చేశారు. తన కెపాసిటీ ఉంటేనే పదవి అడుగుతున్నానని, ఓ బాధ్యతను కోరుతున్నానని స్పష్టం చేశారు. అయితే ఈ మాటలు చెప్పినప్పటికీ, మంత్రి పదవిపై జానారెడ్డి వేసిన చెక్‌ను విరగదలచిన రాజగోపాల్‌కు మద్దతుగా నల్గొండ జిల్లా నేతలు బలంగా నిలిచారు.
ఇకపోతే, నల్గొండ జిల్లాలో తన కుమారులు రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతోనే జానా ఈ లేఖ రాశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం నియోజకవర్గాల సమతుల్యత కోసమేనా? లేక కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడు కాస్త తగ్గించేందుకు తూటా వేసే ప్రయత్నమా? అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.