కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. సంగారెడ్డి లోని మల్కాపూర్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టను అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగ్గారెడ్డి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…
“నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లో నే ఉంటాను. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలతో వైరం పెట్టుకోవద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని తిట్టను. రాజకీయంగా విబేధం ఉన్నా వ్యక్తిగతంగా అంతా మంచిగనే ఉంటాను.
కాంగ్రెస్ కార్యకర్తల వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు అవసరం. పార్టీనే నమ్ముకున్న వారు ఏ పని చేయలేరు. దీంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కార్యకర్తల అవసరాల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేస్తాను. ఆ వచ్చిన డబ్బును కార్యకర్తలకు ఇస్తా. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి. అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవాలి. కార్యకర్తలు ఇళ్లు, స్థలాలు అమ్మి అయినా సరే గెలిచి తీరాలి. అప్పుడు నేను మీరు పెట్టిన దానికి డబుల్ ఇస్తా. ఎట్టి పరిస్థితిలోనైనా సరే గెలవాలి. మీ వెనుక నేను ఉంటాను” అని జగ్గారెడ్డి అన్నారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని తిట్టను అనడం పై పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరించాల్సినవారు ఇలా మాట మార్చారేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగ్గారెడ్డి పై ఎన్నికలకు ముందు పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులలో ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా జగ్గారెడ్డి ఇలా మాట్లాడుతున్నారా అని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జగ్గారెడ్డి కొత్త పల్లవి చర్చనీయాంశమైంది.