ముందస్తు ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 11 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరికొంతమంది కలెక్టర్లను త్వరలోనే బదిలీ చేయనుంది.
దాదాపు బదిలీ అయిన కలెక్టర్లు అందరికీ మళ్ళీ కలెక్టర్లగానే మరొక జిల్లాకు మార్చటం జరిగింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ బదిలీలు నిర్వహిస్తుంది కాబట్టి ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్టు స్పష్టం అవుతోంది. ఎవరెవరు ఏ జిల్లాలకు బదిలీ అయ్యారో పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
హైదరాబాద్ కలెక్టర్ గా రఘునందన్ రావు బదిలీ అయ్యారు, ఈయన ఇప్పటివరకు రంగారెడ్డిలో విధులు నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ గా ఉన్న లోకేష్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా, హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న యోగితా రాణాకు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు.
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డిని సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ గా, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా కృష్ణ భాస్కర్, కొమరం భీం జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వరంగల్ అర్బన్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.
కొత్తగూడెం కలెక్టర్ ఆర్జీ హన్మంతు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెలెక్టర్ గా, ఖమ్మం కలెక్టర్ గా ఆర్ వీ కర్ణన్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అమోయ్ కుమార్, సంగారెడ్డి కలెక్టర్ గా హనుమంతరావు ట్రాన్స్ఫర్ అయ్యారు.
అయితే అందరూ ఆమ్రపాలి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆవిడ బదిలీ కన్ ఫార్మ్ అయింది. వరంగల్ కలెక్టర్ గా ఆమెను విధుల నుంచి తప్పించి ఆమె స్థానంలో ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆమ్రపాలి బదిలీ ఎక్కడికి అనేది సస్పెన్స్ లో పడింది.