తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల పై పడింది. అప్పుడే పార్లమెంట్ ఎన్నికల వేడి తెలంగాణలో మొదలైంది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆయన వివిధ పార్టీల అగ్రనేతలతో సమావేశమయ్యారు. మరీ జాతీయ రాజకీయాలలోకి ఎంటర్ అవుతున్న సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటి చేస్తారు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే సీఎం కేసీఆర్ పోటి చేసే స్థానం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఇంతకీ సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటి చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…
సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటి చేసిన ఆయన విజయం ఖాయమేనన్న ధీమా టిఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే పార్టీకి కాస్త బలం తక్కువగా ఉన్న స్థానంలో పోటి చేస్తే విజయ ఢంకా మోగించవచ్చనే ఆలోచనలో టిఆర్ఎస్ వర్గాలున్నాయట. సీఎం కేసీఆర్ గతంలో కరీంనగర్, మహబూబ్ నగర్ స్థానాల నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటి చేస్తారనే దాని పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఆయన నల్లగొండ పార్లమెంట్ సీటు నుంచే బరిలోకి దిగుతారని ఖాయమైందని తెలుస్తోంది.
2014 లో నల్లగొండ ఎంపీగా టిఆర్ఎస్ నుంచి తేరా చిన్నప్పరెడ్డి పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్ధి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికలలో సిట్టింగ్ లకే మళ్లీ అవకాశాలు ఉంటాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇక్కడ ఉన్న గుతా సుఖేందర్ రెడ్డి ఎంపీగా పోటి చేయనని ఇప్పటికే స్పష్టం చేశారు. నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచిన కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఎంపీ గా పోటి చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటి చేస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. జానారెడ్డి కూడా ఎంపీగా పోటి చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కు బలం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో తానే ఎంపీగా దిగాలని కేసీఆర్ భావిస్తున్నారట. గతంలో కూడా నల్లగొండ ఎమ్మెల్యేగా పోటి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇక్కడ భూపాల్ రెడ్దికి టికెట్ ఇచ్చారు. ఎంపీగానైనా నల్లగొండ స్థానం నుంచి పోటి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. పలు సందర్బాలలో మీటింగ్ లలో కూడా కేసీఆర్ నల్లగొండ ప్రస్తావన తీసుకొచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ నుంచి పోటి చేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. నల్లగొండలో కాంగ్రెస్- టిఆర్ఎస్ కే పోటా పోటి ఉంది.
కాంగ్రెస్ ను ఢికొట్టాలంటే నల్లగొండ ఎంపీగా తానే బరిలో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారట. నల్లగొండ ఎంపీగా గతంలో పోటి చేసిన వారు వివిధ పదవులలో ఉన్నారు. కొత్తగా కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చినా కోమటిరెడ్డి పోటి చేస్తే ఎమ్మెల్యేగా ఓడిపోయిన సానుభూతితో అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే నల్లగొండ ఎంపీగా కేసీఆరే పోటి చేసి గెలవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటి చేయడం దాదాపు ఖాయం అయిందని తెలుస్తోంది. కానీ చివరి క్షణంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా చర్చించుకుంటున్నారు.