ఈసారి కొంత మంది మంత్రి పదవులు ఊడుతాయి : సీఎం కేసీఆర్

ఐదు రోజుల జాతీయ పర్యటనను ముగించుకొని సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం ఢిల్లిలో టిఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ విందునిచ్చారు. ఈ విందు  కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఎంపీలతో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని, కష్టపడని వారి పై వేటు కూడా పడుతుందని ఆయన నేతలను హెచ్చరించారట. ఆయన ఢిల్లీలో ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…

“త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అందులో పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయి. ఈ సారి కొంత మంది మంత్రి పదవులు కూడా పోతాయి. మంత్రి పదవులకు ఎవరిని ఎంపిక చేయాలనే దాని పై ఇప్పటికే నేను స్పష్టతతో ఉన్నాను. కష్టపడ్డ వారికే పదవులిస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో 100 కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామనుకున్నాం. కానీ పార్టీలోని కొంత మంది నేతల వల్లనే కొన్ని . ప్రాంతాల్లో ఓడిపోయాం. మరికొన్ని ప్రాంతాల్లో మెజార్టీ రాలేదు. కొంత మంది కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ విజయం కోసం పని చేయలేదు. వారందరిని త్వరలోనే ఇంటికి సాగనంపుతాం. మరి కొంత మంది పార్టీ కార్యాలయాల్లో కుర్చీలకే పరిమితమయ్యారు. వారి పై కూడా చర్యలు ఉంటాయి.

ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతలు ఒకరినొకరు ఓడించుకోవాలనుకున్నారు. వారిద్దరి మధ్య గొడవలెలా ఉన్నా పథకాలను చూసి గెలుస్తాం అనుకున్నాం కానీ ఖమ్మంలో విలక్షణమైన తీర్పు వచ్చింది. ఏదో తూతూ మంత్రంగా పని చేస్తామంటే సహించేది లేదు. పాలనా పరంగా కూడా సిబ్బంది, అధికారుల అలసత్వాన్ని సహించేది లేదు. శాఖల వారీగా ప్రగతి కనిపించాలి. లేకపోతే చర్యలుంటాయి.  

64 ఏళ్ల వయసులో నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఈ చలిలో ఎందుకు తిరుగుతున్నాను? తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేమీ స్వార్థం లేదు. అందరిలోనూ ఇలాంటి ఆలోచనలు రావాలి.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు అందరూ కృషి చేయాలి. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న వేళ సొంత పార్టీలోనే కుంపట్లు ఉంటే ప్రజలకు నమ్మకం కలగదు. ఎంపీలుగా మీరంతా ఈ కృషిలో భాగస్వాములు కావాలి. అందరూ విబేధాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పని చేయాలి  ”  అని సీఎం కేసీఆర్ ఎంపీలతో అన్నట్టు తెలుస్తోంది.  

కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రూపు రాజకీయాలు నడిచాయని అయినా ప్రజలు రథసారథి కేసీఆర్ నే చూసి ఓట్లు వేశారని ఎంపీలు కేసీఆర్ తో అన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పార్లమెంట్ ఎన్నికల్లో జరగవని వాటిని అధిగమించి 16 సీట్లను గెలుస్తామని కేసీఆర్ తో  ఎంపీలు అన్నారని సమాచారం.

మంత్రి వర్గంలో మార్పులు తప్పవని, పని చేయని వారి పై వేటు వేసి కష్టపడ్డవారికే పదవులిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో పదవులలో  ఉండేదెవరు, పోయేదెవరు అనే చర్చ పార్టీలో జరుగుతోంది.