బాబు – చినబాబు.. మధ్యలో కేటీఆర్!

ఇంతలోనే ఏమి జరిగిందో తెలియదు.. అసలు ఇలా ఎందుకు మారారో తెలియదు.. ఈస్థాయిలో ఇలా ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నారో తెలియదు.. నిన్నమొన్నటి వరకూ పచ్చగడ్డివేస్తే బగ్గుమనే పరిస్థితి నడుమ పొగడ్తలు ఎందుకో తెలియదు..! ఇవన్నీ ఎందుకు తెలియదంటే… అటు చంద్రబాబు, ఇటు లోకేష్ బాబూ విడివిడిగా తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను తెగ పొగిడేశారు!

చంద్రబాబు హైదరాబాద్ ని వీడి, కరకట్టకు షిఫ్ట్ అయిపోవడానికి కారణం నోటుకు ఓటు అని ఒక టాక్ సమాజంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేటీఆర్.. చంద్రబాబుపై వేసిన సెటైర్లు, చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు! ఇదే క్రమంలో.. కేటీఆర్ గతంలో చేపట్టిన మంత్రిత్వ శాఖలే తాను కూడా చేపట్టాలని చినబాబు పోటీపడిమరీ అందిపుచ్చుకున్న సంగతీ తెలిసిందే!

ఇంకా గట్టిగా మాట్లాడితే… తెలంగాణలో టీడీపీని ఉతికి ఆరేసి, నామరూపాలు లేకుండా చేయడంలో కేటీఆర్ పాత్ర కీలకం అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి! అలాంటి కేటీఆర్ గురించి… ప్రముఖ గాయని స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న సోనీ లివ్ “నిజం విత్ స్మిత్” టాక్ షో లో చంద్రబాబు తెగ పొగిడేశారు!

అవును… “కేటీఆర్ అనుకున్నది సాధించగల వ్యక్తి.. కేటీఆర్ మంచి కమ్యూనికేటర్..” ఈ మాటలు అన్నది చంద్రబాబు! అదేవిదంగా… ఏపీ ఐ‌టి పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని విమర్శించే క్రమంలో… “తెలంగాణ ఐ‌టి పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తో సెల్ఫీలు దిగేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు – చివరికి మన ఏపీ ఐ‌టి పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కూడా హైదరాబాద్‌ వెళ్ళి కేటీఆర్‌ తో సెల్ఫీలు దిగి, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో గర్వంగా పోస్ట్ చేసుకొన్నారు.. అది కేటీఆర్ గొప్పతనం”! ఆ స్థాయిలో కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు చినబాబు! ఈ ప్రశంసలు తెలంగాణ టీడీపీ నేతల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ… తండ్రీకొడుకులు ఇద్దరూ కేటీఆర్ ని ఈ విధంగా పొగిడేశారంతే!

దీంతో… అసలు తెలంగాణలో ఏమి జరుగుతుంది? తెలంగాణ టీడీపీలో మరేమి జరుగుతుంది? వంటి ప్రశ్నలు ఎవరికి వారే వేసుకుంటున్నారు టి.తమ్ముళ్లు! కాగా… నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే!