KTR: మరోసారి అంతర్జాతీయ వేదికలపై కేటీఆర్.. ఒకేసారి రెండు!

తెలంగాణ అభివృద్ధికి కొత్త దిక్సూచి చూపించిన నేతగా పేరున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లండన్ నుంచి రెండు ప్రతిష్ఠాత్మక ఆహ్వానాలు అందాయి. టెక్ రంగాన్ని తెలంగాణలో మళ్లీ తీర్చిదిద్దిన నాయకుడిగా ఆయనకు అంతర్జాతీయంగా గౌరవం పెరిగిపోతుంది. ఇందుకు నిదర్శనంగా మే 30న ఆయన లండన్‌లో రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.

మొదటిగా, బ్రిడ్జ్ ఇండియా నిర్వహించే ‘ఐడియాస్ ఫర్ ఇండియా 2025’ సదస్సుకు కేటీఆర్‌ను ముఖ్య వక్తగా ఆహ్వానించారు. రాయల్ లాంకాస్టర్ హోటల్ వేదికగా జరిగే ఈ ఫోరమ్‌ దేశాభివృద్ధిపై కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ కేటీఆర్ తన అనుభవాలు, పాలనలో అమలు చేసిన ఆవిష్కరణలను ప్రపంచ స్థాయిలో పంచుకోనున్నారు. రాజకీయాలు, పాలన, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టే ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం ఆయనకు మరో గుర్తింపుగా నిలవనుంది.

అలాగే అదే రోజున, లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లో ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ (PDSTL) ఏర్పాటు చేసిన తమ నూతన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇన్నోవేషన్ రంగానికి ఆయన చూపిన ప్రోత్సాహం, శాస్త్రీయ పరిశోధనలకు కల్పించిన వాతావరణం నేపథ్యంలో ఈ ఆహ్వానం అందిందని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. తెలంగాణలో హైరాబాద్ మాదిరిగా టెక్నాలజీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఇప్పుడు లండన్ వేదికపై ప్రశంసలందుకుంటోంది.

ఈ రెండు కార్యక్రమాలూ కేటీఆర్‌కు వ్యక్తిగతంగా గౌరవమే కాదు, తెలంగాణ ప్రతిష్ఠకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలుస్తున్నాయి. పాలనను పరిపక్వత, ఆధునికతతో ముడిపెట్టిన నాయకుడిగా ఆయన మరోసారి ప్రపంచ వేదికపై మెరుస్తున్నారు.