బాసరలోని ఐఐఐటి విద్యార్ధులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళన బాట పట్టారు. విద్యార్ధుల ఆందోళనతో కళాశాలకు సెలవులిస్తూ మెస్ లు మూసివేస్తూ అధికారులు నోటిసులు జారీ చేశారు. అధికారుల తీరుపై విద్యార్దులు తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కళాశాలలో ఓ విద్యార్ధిని ప్రేమ విఫలంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ అమ్మాయి మృతికి ప్రేమతో పాటు కళాశాల పరిస్థితులు కూడా కారణం అని విద్యార్దులు ఆరోపించారు. శని, ఆది, సోమ వారాల్లో వరుసగా మంత్రి కేటిఆర్ కు ట్వీట్లు చేశారు. కేటిఆర్, కడియం, గవర్నర్ లకు విద్యార్ధులు లక్ష ట్వీట్లు చేశారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తామని వీసీ హామీనిచ్చినా వారు వెనక్కు తగ్గలేదు. తమ సమస్యల పై కేటిఆర్, గవర్నర్ జోక్యం చేసుకోవాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్దుల ఆందోళన పై మంత్రి కేటిఆర్ స్పందించి వీసీతో మాట్లాడారు. విద్యార్ధి బృందాన్ని హైదరాబాద్ కు పంపితే వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్దులకు చెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. విద్యార్ధుల ఆందోళన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
విద్యాలయంలో ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించి ల్యాప్ టాప్ లు ఇవ్వాలి. విద్యార్ధులతో పాలక మండలి ఏర్పాటు చేయాలి. శాశ్వత ఉపకులపతిని నియమించాలి. సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసి, విద్యాలయంలో పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని విద్యార్దులు డిమాండ్ చేస్తున్నారు. కేటిఆర్, కడియం, గవర్నర్ లు ఇక్కడికి వచ్చి హామీనిచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్దులు స్పష్టం చేశారు.
విద్యార్దుల ఆందోళనతో మెస్ మూసి వేస్తామని అధికారులు నోటిసులు జారీ చేశారు. మండుటెండల్లో కూడా విద్యార్దులు నిరసన తెలిపారు. పోలీసులు విద్యార్ధులను అడ్డుకోవడంతో మెయిన్ గేట్ వద్ద బైఠాయించి విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు. మెస్ మూసివేయడంతో విద్యార్దులు ఆకలితో అలమటిస్తున్నారు. అధికారుల తీరు పై తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి, వినండి