‘‘బరంపూర్’’ ఈ తెలంగాణ పల్లెటూరిలో 54 ఏండ్లుగా సర్పంచ్ ఎన్నికలు లేవు

 

(జి సుగుణాకర్ రెడ్డి)

తెలంగాణలో అదో ఏజెన్సీ గ్రామం. ఆ ఊరు పంచాయతిగా ఏర్పడిన నాటి ను౦చి సర్పంచ్ పదవి తో పాటు వార్డ్ మెంబర్లకు సైతం ఎన్నికలు లేవు. ఈ పంచాయతీ ప్రజలు పోలింగ్ బూత్ కు వెళ్లి సర్పంచ్ ఎన్నికల వేళ ఓటేసింది లేదు. వేలిపై సిరా చుక్క అద్దింది లేదు. పంచాయతి గా ఏర్పడినపుడు జనరల్ గా ఉన్నప్పటికీ కొన్ని గిరిజన తండాలు కలవడం తో ఏజెన్సీ గ్రామం గా మారిపాయింది. జనరల్ గా ఉన్న సమయం లోనూ, ఆ తర్వాత కూడా ఏకగ్రీవమే తప్ప ఎన్నికలు లేవు. ఆ గ్రామమే బరంపూర్. ఇంతకు ఎందుకు ఎన్నికలు జరగడం లేదు? ఎవరు కూడా పోటీ లో ఎందుకు ఉండటం లేదో తెలియాలంటే ఈ స్టొరీ చదవాల్సిందే.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉన్నది ఈ బరంపూర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 2050 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతి పరిది లో గతం లో నందిగామ, మధునాపూర్, నర్సాపూర్ ల తో కలిపి పెద్ద పంచాయితిగా ఉండేది. ప్రస్తుతం నందిగామ ఈ పంచాయితి నుండి విడిపోయి కొత్త పంచాయితిగా ఏర్పడింది.

పంచాయతీ పుట్టినప్పటి నుంచి సర్పంచ్ లు వీరే

దీని పరిది లో నర్సాపూర్, మధునాపూర్ గ్రామాలు మాత్రమే ఉన్నాయి. 1964 లో గ్రామ పంచాయతి గా ఏర్పడిన నాటి నుంచి ఈ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగింది లేదు. జనాలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసింది లేదు. ఏనాడైనా ఏకగ్రీవమే అయింది. 1964 నుంచి 1968 వరకు ఏనుగు కిష్టన్న సర్పంచ్ గా కొనసాగారు. 1968 నుంచి 1987 వరకు ముడుపు భూమారెడ్డి 20 ఏళ్ల పాటు సర్పంచ్ గా సేవలు అందించారు. 1987 నుంచి 1998 వరకు నూతిపెల్లి ఆశన్న 10 ఏళ్ల పాటు కొనసాగారు. 2001 నుంచి 2006 వరకు మేస్రం సోమన్న, 2013 నుంచి 2018 వరకు సిడాం లస్మన్న సర్పంచ్ లు గా వ్యవహరించారు. వీరంతా కూడా ఏకగ్రీవ సర్పంచ్ లు కావడం విశేషం. ఇప్పుడు రిజర్వేషన్ లలో భాగంగా ఎస్ సి మహిళ కు కేటాయించబడి౦ది. ఈ సారి కూడా ఏకగ్రీవం అవుతుందని గ్రామస్తులు చెపుతున్నారు.

అభివృద్ధి కోసమే అంటున్నారు

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయాం లో ఏకగ్రీవం అయినందుకు గాను 5 లక్షల రూపాయల నజరానా ఈ గ్రామానికి దక్కింది. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ సర్కారు 10 లక్షల నజరానా అందచేసింది. ఈ నిదులతో సీ సి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ప్రజా ప్రతినిధుల సహకారం తో వంద శాతం మరుగు దొడ్లు నిర్మాణం చేపట్టారు. డబల్ రోడ్ల తో సెంట్రల్ సోలార్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 

అనుబంధంగా ఉన్న గ్రామాలకు రోడ్లు మెరుగుపరిచారు. రెండు దశాబ్దాలు సర్పంచ్ గా వ్యవహరించిన భూమా రెడ్డి గ్రామాభివృద్ది కి పాటు పడటమే కాకుండా గ్రామస్తుల మద్య ఐక్యత కు కృషి చేసారు. ఏకగ్రీవం అయితే ప్రభుత్వం నుండి వచ్చే నజరానా లతో అభివృద్ధి చేసుకోవచ్చు అని గ్రామస్థులు అందరు ఒకే తాటిమీద ఉన్నారు. ఈ బరంపూర్ గ్రామం తెలంగాణ పల్లెటూర్లకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదేమో?

బరంపూర్ గ్రామానికి సంబంధించిన ఫొటోలు కింద ఉన్నాయి చూడొచ్చు.

 

సుదీర్ఘ కాలం సర్పంచ్ గా చేసిన భూమారెడ్డి