ఈమధ్య వెలుగుచూసిన ఇండియా టుడే సర్వే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. సర్వే ఫలితాల ప్రకారమైతే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని 43 శాతం మంది అనుకుంటున్నట్లు స్పష్టమైంది. చంద్రబాబునాయుడే కంటిన్యు అవ్వాలని అనుకుంటున్న వారు 38 శాతం మంది. సరే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కూడా 5 శాతం మంది మొగ్గు చూపారనుకోండి అది వేరే సంగతి. 14 శాతం మంది ఎటు మొగ్గుచూపింది సర్వేలొ స్పష్టంగా చెప్పలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. అదేమిటంటే జగన్ వైపు మొగ్గు చూపింది 43 శాతం మాత్రమే. అదే విధంగా చంద్రబాబువైపు కూడా 38 శాతం మొగ్గుచూపారు. నాలుగున్నరేళ్ళ పాలన తర్వాత కూడా ఇంకా 38 శాతం మంది జనాలు చంద్రబాబునే సిఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే, నిజానికి నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబువి అన్నీ వైఫల్యాలే అని చెప్పవచ్చు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. పైగా రుణమాఫీ, కాపులను బిసిల్లో చేర్చటం, నిరుద్యోగ భృతి, రాజధాని నిర్మాణం, ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ సాధన లాంటి కీలక హామీల్లో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఎన్నికల నాటికి ఈ వ్యత్యాసం మరింత పెరిగితే మాత్రం చంద్రబాబుకు ఇబ్బందులే.
నాలుగున్నరేళ్ళ వైఫల్యాల తర్వాత చూడా చంద్రబాబును ఇంకా 38 శాతం మంది నమ్ముతున్నారంటే నిజంగా చంద్రబాబు గొప్పోడనే అనుకోవాలి. ఇదెలా సాధ్యమైందంటే, కేవలం మీడియా మద్దతుతోనే అని చెప్పుకోవాలి. తన వైఫల్యాలను బయటపడకుండా జనాల కళ్ళకు గంతలు కడుతూ జాగ్రత్తగా మ్యానేజ్ చేస్తున్నారు. పైగా సమయం వచ్చినపుడల్లా తన వైఫల్యాలను ప్రత్యర్దుల ఖాతాలో వేసేస్తు వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై వేసిన పిల్లిమొగ్గలే అందుకు నిదర్శనం.
నాలుగున్నరేళ్ళ తర్వాత కూడా ప్రత్యేకహోదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని టిడిపి మీడియాలో ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక, రుణమాఫీ సక్రమంగా కాలేదన్నది వాస్తవం. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా చంద్రబాబు కంపు చేసేసారు. కానీ దానివల్ల తనపై ప్రజాగ్రహం కనబడకుండా మీడియా దన్నుతో నెట్టుకొస్తున్నారు. పైగా ఈ విషయాల్లో తన వైఫల్యాలను ఎటువంటి సంబంధం లేని జగన్ ఖాతాలో వేసేసి పబ్బం గడుపుకుంటున్నారు. వైసిపి ఎంఎల్ఏలను ఫిరాయింపులకు నిసిగ్గుగా ప్రోత్సహించి ప్రజాసమస్యల పరిష్కారంపై చిత్తశుద్ది లేదుకాబట్టే వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీకి హాజరుకావటం లేదని ప్రచారం చేయిస్తున్న ఘనుడు చంద్రబాబు.
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సొచ్చిందంటే జగన్-చంద్రబాబు మధ్య ఉన్న 5 శాతం వ్యత్యాసం ఏమంత ఎక్కువ కాదు. తొమ్మిది నెలల కాలంలో తన మీడియా పవర్ తో ఆ వ్యత్యాసాన్ని చంద్రబాబు అధిగమించే అవకాశం ఉంది. ఆ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటే ఇద్దరికి అది ఒక హెచ్చరిక అనే చెప్పుకోవాలి. 5 శాతం వ్యత్యాసాన్ని కనీసం 10 శాతానికి పెరిగేట్లు చూడాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అందుకు ప్రభుత్వంపై ఎటువంటి పోరాటాలు చేయాలి ? చంద్రబాబుకున్న మీడియా బలాన్ని ఎలా బద్దలు కొట్టాలనే అంశంపై జగన్ తో పాటు నేతలందరూ కష్టపడాలి. అంతకుమించి ఎలక్షనీరింగ్ అన్నది చాలా కీలకమైన అంశం. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
అదే సమయంలో 5 శాతం వ్యత్యాసాన్ని భర్తీ చేసుకునే అవకాశాలను చంద్రబాబు అన్వేషించుకోవాలి. ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు ఎటూ ధిట్టే. అందులోనూ మీడియా పవర్ కావాల్సినంతుంది. కాబట్టి అభ్యర్ధులను గట్టి వారిని రంగంలోకి దింపి సంక్షేమ పథకాలు సక్రమంగా లబ్దిదారులకు అందేట్లు జాగ్రత్తలు తీసుకుంటే వ్యత్యాసాన్ని అధిగమించటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విషయం మరోటుంది. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారో చెప్పమంటే ఎటు తేల్చుకోలేని వారు 14 శాతమున్నారు. 14 శాతమంటే మామూలు విషయం కాదు. వీరిలో ఎక్కువమందిని ఎవరు ఆకట్టుకోగలిగితే విజయం వారిదే.