అనుకున్నంతా జరిగింది. నాలుగేళ్ళ క్రిందట గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించటానికి మీడియా, పీఠాధిపతులే కారణంగా రిపోర్టులో తేలిపోయింది. ప్రమాదానికి కారణం చంద్రబాబునాయుడు, ఉన్నతాధికారుల వైఫల్యమే అని ఒకవైపు అందరూ ఘోషిస్తుంటే సోమయాజులు కమిటీ మాత్రం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేదని తేల్చేసింది. పైగా తప్పంతా మీడియా, పీఠాధిపతులు, జనాలపైనే నెట్టేయటం విడ్డూరంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, 2015 జూలై 15 వ తేదీన గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాల ప్రారంభ ముహూర్తానికి ప్రభుత్వమే స్వయంగా మఠాధిపతులు, పీఠాధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. పుష్కరాలపై దాదాపు రెండు నెలల ముందు నుండే ప్రభుత్వం మీడియాలో ఒకటే ఊదరగొట్టిన విషయం అందరూ చూసిందే. భారీ ఎత్తున జరుగుతున్న పుష్కరాలు కాబట్టి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది.
మొత్తానికి పుష్కరాల ముహూర్తానికి చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా రాజమండ్రికి చేరుకున్నారు. మఠాధిపతుల పూజలు, హారతి ఇచ్చిన తర్వాత చంద్రబాబు పుష్కర ఘాట్లో స్నానం చేశారు. తర్వాత కుటుంబంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సిఎం అక్కడి నుండి వెళ్ళిపోయారో పోలీసులు, ఉన్నతాధికారులు కూడా అక్కడి నుండి మాయమైపోయారు. అప్పటికే పుష్కర స్నానం చేద్దామని అక్కడికి చేరుకున్న వేలాది మంది భక్తులను ఒక్కసారిగా పోలీసులు గేట్లెత్తి ఘాట్లలోకి అనుమతించారు. ఎప్పుడైతే వేలాదిమంది ఘాట్లపైకి చేరుకున్నారో తొక్కిసలాట జరిగింది. దాంతో 29 మంది మరణించారు.
ప్రమాదానికి కారణం ఇది. విశాలమైన విఐపి ఘాట్ వద్ద స్నానం చేయకుండా బాగా చిన్నదైన పుష్కర ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబం ఎందుకు స్నానం చేసిందో ఇప్పటి వరకూ ఎవరు చెప్పలేకున్నారు. అదే సందర్భంగా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో పడటం కోసమే చంద్రబాబున్న చోట వేలాదిమంది భక్తులు చేరేట్లు అధికారులు ప్లాన్ చేశారు. అదే సందర్భంలో ప్రమాదం జరిగినపుడు అక్కడున్న సిసి టివి ఫుటేజిలు మాయమైపోయాయి. దాంతో పాటు ద్రోణ్ కెమెరాల్లోని ఫిల్మ్ కూడా కనిపించటం లేదు.
పుష్కర ముహూర్తంలో స్నానం చేస్తే పుణ్యమొస్తుందని ప్రచారం చేసిందే ప్రభుత్వం. అటువంటి విషయాలను సోమయాజులు కమిటి పట్టించుకోకుండా తప్పంతా ప్రచారం ఇచ్చిన మీడియాదని, మాట్లాడిన పీఠాధిపతులు, మఠాధిపతులదేనని చెప్పటం విచిత్రంగా ఉంది. పైగా ప్రజల్లోని మూఢ నమ్మకం కూడా ప్రమాదానికి కారణంగా కమిటీ తేల్చేసింది. ప్రమాదం జరిగిన మూడు నెలలకు ప్రభుత్వం కమిటీ వేయటం, కమిటి నియమిచిన మూడేళ్ళ తర్వాత నివేదిక అందటం, అందులో కూడా తప్పంతా ప్రజల మూఢ నమ్మకమే అని తేల్చేయటం విడ్డూరంగా ఉంది.