నాలుగేళ్ల పాటు తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చకోర పక్షల మాదిరిగా ఎదురు చూసిన నిరుద్యోగులకు తొలి తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపింది. నీళ్లు, నిధులు, నియామకాల సాధనగా తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. తాజాగా కొలువు తీరిన టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తే ఉద్యోగాల ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది. మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉద్యోగాల భర్తీకి అడ్డు గోడగా నిలుస్తుందేమోనని తెలంగాణ నిరుద్యోగులు భయపడుతున్నారు.
తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు తెలంగాణలో మళ్లీ చిక్కులు ఏర్పడుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగాల నియమాకాలకు ఆటంకం కలుగుతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పది జిల్లాలతో ఉన్న తెలంగాణను కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 జిల్లాలుగా చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగును జిల్లాగా చేస్తున్నారు. అదే విధంగా మహబూబ్ నగర్ లోని నారాయణ పేటను జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 కు చేరుతుంది. కొత్త జిల్లాలతో పాటు మరో రెవిన్యూ డివిజన్, మరో మూడు మండలాలను కూడా ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పుడు మొత్తం వ్యవస్థను సమీక్షించాల్సి ఉంటుంది.
గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఉద్యోగ నియమాకాలకు ఇబ్బంది ఏర్పడింది. జోన్ల విషయంలో మళ్లీ రాష్ట్రపతి ఉత్తర్వులు కావాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఉద్యోగ నియమాకాలన్ని ఆగిపోయాయి. జిల్లాలకు జోన్లను కేటాయించాల్సి ఉండడంతో ఆలస్యమైంది. జోన్ల ప్రక్రియకు రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉంటుంది. చివరకు ఎన్నికలకు ముందు ఎలాగో అలా రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఇప్పుడు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడితే పాత ప్రాసెస్ అంతా సాగాలి.
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఒణగురే ప్రయోజనం ఏమిటో తెలంగాణ ప్రజానికానికి ఇప్పటికి కూడా అర్ధం కావడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. కొత్త జిల్లాలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరిగింది. పోస్టుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అంతా ఆశించారు. కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటుతో మ్యాన్ పవర్ అవసరం ఉంటుందని అంతా భావించారు. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అదనపు ఉద్యోగాలు కూడా రాలేదని యూత్ అంటున్నారు. తెలంగాణ సమాజం జిల్లాకు కలెక్టర్, ఎస్పీలను నియమించారు తప్పా ప్రత్యేకంగా చేసిందేం లేదని నిరుద్యోగులు తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జిల్లా పరిధి తక్కువ ఉండడంతో ఆర్డీవో స్థాయి పనులను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
పది జిల్లాలను 31 జిల్లాలుగా ప్రకటించినప్పటికి ఒక్క కొత్త ఉద్యోగం రాలేదని ఇప్పుడు మరో రెండు కొత్త జిల్లాలతో ఏం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి కొత్త జిల్లాలు ఉనికిలో ఉన్నాయో లేవో కూడా అర్దం కావడం లేదంటున్నారు. ఎక్కడ ఏ సమావేశం జరిగిన, సమీక్షలు జరిగినా అంతా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వ్యవహారాలు నడుపుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సమీక్షలు జరిపే అధికారులు కూడా ఉమ్మడి జిల్లాలనే సంభోదిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసం మళ్లీ ఢిల్లి బాట పట్టాలి. వీళ్లు ఇచ్చేదెప్పుడు.. వాళ్లు చేసేదెప్పుడని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేసే వరకు నోటిఫికేషన్లు రావు. అంటే మరో సారి తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం తప్పదన్నమాట.
సాధారణంగా జిల్లాలు పెద్దగా ఉంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడం చూశాం కానీ ఇలా మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఓ జిల్లాను ఏర్పాటు చేయడం తెలంగాణలోనే జరిగిందని ఆశ్చర్య పోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలా జరగలేదన్నారు. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటు మరోసారి నిరుద్యోగుల పాలిట శాపంగా మారబోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. దీని పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని అంతా చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్లకు ఇబ్బంది లేకుండా ప్రక్రియ చేసే మార్గాలను చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నోటిఫికేషన్లు వేయకుండా ఆలస్యం చేస్తే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓయూ జెఏసీ నేతలు, నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.