కొమురం భీం జిల్లాలో దారుణం.. పెళ్లయిన 10 నెలలకి ఆత్మహత్య చేసుకున్న వధువు..?

రోజురోజుకీ దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న కూడా మహిళల పట్ల అత్తింటి వారు పెట్టే వరకట్న వేధింపులు మాత్రం తగ్గటం లేదు. వరకట్న వేధింపులను నివారించడానికి ప్రభుత్వాలు పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన కొమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త , అత్తమామలు పెట్టే వేధింపులు భరించలేక పెళ్లయిన 10 నెలలకే వధువు ప్రాణాలు తీసుకుంది.

వివరాలలోకి వెళితే… కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కౌటాల సమీపంలోని శివలింగాపూర్ కు చెందిన దోంగ్రే ప్రహ్లాద్ తన రెండవ కూతురు సంధ్యని కౌటాలకు చెందిన రౌతు రేవాంజి(వీఆర్ఏ) కొడుకు రౌతు జయంత్ కు ఇచ్చి గత ఏడాది నవంబర్14న పెండ్లి చేశారు. పెళ్ళి టైంలో సంధ్య తల్లిదండ్రులు రూ.మూడున్నర లక్షల నగదు ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ డబ్బు సర్దుబాటు కాకపోవడంతో కల్యాణలక్ష్మి స్కీమ్ కింద వచ్చిన రూ.లక్ష ఇచ్చి మిగిలినవి తర్వాత ఇస్తామని చెప్పు పెళ్ళి జరిపించారు.

పెళ్లి జరిగిన కొంతకాలానికి వరకట్నం కోసం భర్త అత్తమామలు, సంధ్యని వేదించడంతో పుట్టింటికి వచ్చింది. పెద్ద మనుషులు పుట్టింటి తరపు బంధువులు సర్దిచెప్పి పంపడంతో అత్తగారింటికి వెళ్లిన సంధ్య తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ కి వెళ్ళింది. దసరా పండుగ సందర్భంగా నాలుగు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చిన సంధ్యని మళ్లీ వరకట్నం కోసం వేధించటం మొదలుపెట్టారు. దీంతో సంధ్య తల్లిదండ్రులు ఆదివారం తన అత్తగారింటికి వెళ్లే వరకట్నం గురించి చర్చించారు. ఆ సమయంలో తన అత్తమామలు భర్త అన్నమాటలకు సంధ్య ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సంధ్యా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.