అత్త మామల వేదింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ అల్లుడు…!

యువతీ యువకుల జీవితాల్లో పెళ్లి అనేది ఒక మధురమైన సంఘటన. పెళ్లి తర్వాత వారి జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందని ఇద్దరు భావించి కొత్త జీవితం మొదలుపెడతారు. అయితే పెళ్లి తర్వాత అందరి జీవితాలు సంతోషంగా ఉండవు. కొందరి జీవితాలలో పెళ్లి కష్టాలు, బాధలను మాత్రమే మిగులుస్తుంది. అమ్మాయిలు కోటి ఆశలతో పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెడితే అత్తింటి తరుపు వారి వేధింపులు భరించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అత్తమామల వేధింపులు భరించలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్​లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జాడిమల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్​కు​ అదే గ్రామానికి చెందిన మమతని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకొని అత్తగారింటికి ఇల్లరికం వెళ్ళాడు. అయితే అత్తగారింట్లో అప్పుడప్పుడు తన అత్తమామలు తనని అవమానిస్తూ మాట్లాడటంతో వెంకటేష్ తరచూ బాధపడేవాడు. ఇటీవల వెంకటేష్ మమత దంపతులకు ఒక మగ బిడ్డ జన్మించాడు. వారసుడు పుట్టడంతో దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఇలా కొడుకు పుట్టాడన్న సంతోషం లో ఉండగానే వెంకటేశ అత్తమామలు మళ్లీ తనని అవమానపరుస్తూ మాట్లాడటంతో వెంకటేష్ కి చాలా బాధ కలిగింది.

ఇలా అత్తమామలు తనని తరచూ అవమాన పరచడంతో వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ వాట్సాప్ ద్వారా తన అన్నకు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపి ఊరి చివర ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేష్ మరణంతో అతడి తల్లిదండ్రులు రోదన మిన్నంటుతోంది. మనవడు పుట్టి వారం రోజులు కూడా గడవకముందే ఇలా కొడుకుని పోగొట్టుకోవటంతో వారు తీవ్రంగా రోదిస్తున్నారు. తన కొడుకు చావుకు కారణమైన కోడలి తల్లిదండ్రులపై వెంకటేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.