అనంతపురంలో విషాదం.. జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్!

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలకు కూడా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అనంతపురంలో కూడా ఇటువంటి విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన కానిస్టేబుల్ మనస్థాపంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం నగరంలో కలకలం రేపుతోంది. వైవాహిక జీవితం సవ్యంగా లేదన్న కారణంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా కానిస్టేబుల్ మరణానికి కారణమని సమాచారం.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం నగరంలో ఆజాద్ నగర్ కి చెందిన సురేష్ అనే వ్యక్తి 2011 నుండి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో తన మేనమామ కుమార్తె అయిన మౌనికతో సురేష్ కి వివాహం జరిగింది. వివాహం తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మౌనిక తన పుట్టింటికి వెళ్ళిపోగా ఇద్దరు కూడా విడాకులకు దరఖాస్తు చేశారు. ఇక ఇటీవల విడాకులు కూడా మంజూరు అయ్యాయి. విడాకులు మంజూరైనప్పటినుండి సురేష్ తన వైవాహిక జీవితం నాశనమైందని తరచూ తన తల్లిదండ్రుల వద్ద బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో జులై 21 నుండి మెడికల్ లీవ్ తీసుకుని రాంనగర్ పార్క్ సమీపంలో ఉన్న ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడ ఒంటరిగా ఉండేవాడు.

రోజు తన ఇంటికి వెళ్లి భోజనం చేసి తర్వాత అద్దె గదికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి భోజనం చేసిన తర్వాత తిరిగి అద్దె ఇంటికి వెళ్ళాడు. శుక్రవారం రాత్రి తన తండ్రి ఫోన్ చేసినా కూడా సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అలాగే శనివారం ఉదయం చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అద్దె గది వద్దకు వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. దీంతో సురేష్ ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సురేష్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించాడు .

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. సురేష్ చున్నితో సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకోవడంతో ఒంటరిగా ఉండే గదిలోకి మహిళలు ఉపయోగించే చున్ని ఎలా వచ్చిందని అనుమానంతో కేసు దర్యాప్తు మొదలుపెట్టారు . అలాగే మెడికల్ లీవ్ లో ఉన్న సురేష్ కొన్ని రోజులుగా షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో కూడా కేసు దర్యాప్తు ప్రారంభించారు.