తెలంగాణ మొత్తం ఇపుడు వినపడుతున్నది ఒకటే మాట. అదేంటంటే…‘తర్వాతెవరు’? నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్, టిడిపి, సిపిఐ లు పొత్తు అని ప్రకటించినప్పటినుంచి టిఆర్ ఎస్ వర్గాల్లో ఈ చర్చ మొదలయింది. సాయంకాలానికి అది తీవ్రమయింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణా రెడ్డిమీద కేసులు బుక్ అయినప్పటినుంచి తర్వాత క్యూలో ఎవరున్నారు అనే మాట వినబడుతూన్నది. సంగారెడ్డి జిల్లా నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ మీద చాలా రోజులు కత్తులు నూరుతున్న తూర్పు జయప్రకాశ్ రెడ్డివ (జగ్గారెడ్డి)ని చంచల్ గూడ్ జైలుకు పంపారు. ఎపుడో 14 సంవత్సరాల కిందటి కేసులో ఆయన్ని ఇపుడు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ కు పంపారు. జగ్గారెడ్డి కార్యకలాపాల వల్ల జిల్లాలో కాంగ్రెస్ కు వూపొస్తున్నది. ఆయన అరెస్టు కాంగ్రెస్ షాకే. ఇదే విధంగా వరంగల్ జిల్లాలో గండ్ర కూడా కొరుకుడు పడని కొయ్యే. అందుకే ఆయన కట్టడి చేసేందుకు ఆయన మీద గన్ తో బెదిరించి కేసులు నమోదయయ్యాయి.
తర్వాతెవరు?
ఇపుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వూపిరపోసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆపార్టీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రా పార్టీ అని ముద్రవేసి, డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అయితే, పరిస్థితి తారుమారయింది. మార్చురీలో శవం అనుకున్న జీవి కదులుతూఉంది. ఆంధ్రా ముఖ్యమంత్రిని అమరావతికి తరిమేసినా, పార్టీ పోలేదు. ఆలాగే ఉంది. తెలుగుదేశం ఎమ్మ్యేలందనిరి కొనేసినా, ఓటర్లు ఇంకా అలాగే ఉన్నారు. ఈ నమ్మకంతో నే కాంగ్రెస్ టిడపితో పొత్తు పెట్టుకుంటున్నది. దీనికి సిపిఐ , తెలంగాణ జనసమితి కూడా సై అంటున్నాయి. టిడిపికి ఓట్లున్నాయని, అవి కాంగ్రెస్ కు పడతాయని, టిఆర్ఎస్ ను దెబ్బతీస్తాయనే భయంతో పాటు, 2019లో టిడిపి పుంజుకుంటుందనే ఆందోళన టిఆర్ ఎస్ నాయకత్వంలో కూడా బలంగా ఉంది. అందుకే ఈ పొత్తు నడవకుండా చూసే చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ పొత్తు పనిచేయకుండా ఉండాలంటే చంద్రబాబు హైదరాబాద్ వీధుల్లో తిరక్కుండా చేయాలి. తాను ఇదే పార్టీ తో పొత్తు పెట్టుకున్న విషయం తెలంగాణలో ఎవరికీ గుర్తు లేదనుకుని ముఖ్యమంత్రి ‘ఛ్చీ ఛ్చీ ఆంధ్రా పార్టీతో పొత్తా,’ అని ముక్కు మూసుకున్నారు. అది సరే, ఇపుడు ఏమిటి మార్గం.
ఓటుకు నోటు కేసు రాజమార్గం
అందుకే ఏ క్షణాన్నైనా వోటుకు నోటు కేసు తీసి చంద్రబాబు బెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టిఆర్ ఎస్ కార్యకర్తులు చాలా ఆనందంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. తర్వాతెవరు? అంటే ఎవరుంటారు…ఒక్కరే, చంద్రబాబు అంటున్నారు.
చంద్రబాబు మీద వోటుకు నోటు కేసులో చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, జగ్గారెడ్డి, గండ్ర ల మీద వి కూడా పాతకేసులే. చంద్రబాబు మీదున్నది కూడా పాత కేసే. పోలీసులకు ఇపుడు సరయిన ఆధారాలు దొరికాయని చెప్పి చంద్రబాబుకు నోటీసులు పంపించడమో, అరెస్టు వారెంట్ జారీ చేయడమో చేస్తే, చంద్రబాబు ఇక ఆకేసులో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఇది లాయల్ టిఆర్ ఎస్ కార్యకర్తల్లో ఆనందోత్కోహాలు నింపుతుంది. వారు చప్పట్లు కొడతారు. చంద్రబాబు తెలంగాణ రావడం మానేస్తారు. మహా కూటమి తరఫున ప్రచారం చేయడం మానేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రచారం చేయకపోతే చాలు, టిడిపి బిసి వోట్లు కాంగ్రెస్ కు బదలీ కావని,అపుడు కూటమి తుస్సుమంటుందని టిఆర్ ఎస్ లో ఉన్నట్లుంది. ఈ భయం టిడిపి వర్గాల్లో కూడా ఉంది. ఎందుకంటే, వోటుకు నోటు విషయం చర్చ తెలంగాణాలో మొదలయినా ఆంధ్రాలో భూమి కంపిస్తుంది. ఎందుకంటే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అది బాగా ఉపకరిస్తుంది. ఆ పార్టీ ప్రచారంలోె వోటుకు నోటు కేసును వాడుకుంటుటుంది. దీని వల్ల తెలంగాణలో వచ్చే లాభం కన్నా ఆంధ్రాలో నష్టమెక్కువగా ఉంటుంది.
ఎన్నికల ముందు చంద్రబాబు మీద నానుతున్న వోటుకు నోటు కేసు తిరగదోడడం అంత ఈజీయా…
ఏమో రాజకీయాల్లో ఏదయినా సాధ్యమేనన అంటుంటారు.
మనుషుల్ని అమెరికాకుదొంగ రవాణా చేసిన కేసుల్లో కేసిఆర్, హరీ్ ష్ రావు కూడా ఉన్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ చెబుతున్నాడు. రేపు వాళ్లు అధికారంలోకి వస్తే ఈ కేసులు కసిగా తిరగతోడరని గ్యారంటీ ఏముంది.