గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టికి వ్యతిరేకంగా పని చేశారని టిఆర్ఎస్ పార్టీ నుంచి 29 మందిని సస్పెండ్ చేశారు. మహబూబూబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో మొత్తం 29 మంది పై చర్యలు తీసుకున్నారు. పార్టీలో ఉంటూనే రెబల్ గా నామినేషన్ వేశారని అందుకే చర్యలు తీసకున్నట్టు తెలుస్తోంది. దీని పై విచారించిన మండలాధ్యక్షుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులకు వ్యతిరేకంగా రెబల్ గా పలువురు పార్టీ నాయకులు బరిలోకి దిగారు. వారందరిని పార్టీనుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుకి ఫ్యాక్స్ ద్వారా నివేదిక పంపామన్నారు. రెబల్ అభ్యర్దులు కేసీఆర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫోటోలు పెట్టుకోవద్దన్నారు.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిలో మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన చింతల సైదులు, మల్లారెడ్డి లక్ష్మారెడ్డి, మక్బుల్ లక్ష్మయ్య, గడ్డం తిరుపతి, హుస్సేన్, శ్రీరాములు, రవి, కృష్ణ, భద్రయ్య, గడ్డి గూడెం తండాకు చెందిన వస్రాం, దారావత్ దస్రు, కంబాలపల్లికి చెందిన కత్తుల మల్సూర్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న, జగ్నీ, సత్యం, ముడుపుగల్ కు చెందిన మార్కెట్ వైస్ చైర్మన్ జెరిపోతుల వెంకన్న, ఉపేందర్, బాలాజీ, ఉప్పలయ్య, ఇద్దయ్య, అయోధ్యకు చెందిన గిరి, లక్ష్మణ్, రవి, అశోక్, వీరన్న, ఇస్తావత్ తండాకు చెందిన శంకర్ లను సస్పెండ్ చేశారు.
ఒకే సారి 29 మంది నేతలను సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సస్పెండ్ అయిన నేతలు అన్నారు. కొంత మంది దగ్గర డబ్బులు తీసుకొని అభ్యర్దులను ప్రకటించారని పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించలేదన్నారు. అందు కోసమే తాము రెబల్ గా బరిలో దిగాల్సి వచ్చిందని దానికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని వారు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు అసలు నిజాలు తెలుపుతూ లేఖ రాస్తామని త్వరలోనే కేటిఆర్ ను కలిసి అంతా వివరిస్తామన్నారు.