తెలంగాణలో కేసిఆర్ ను భయపెట్టిన.. ఆ రెండు సెక్షన్లు

ప్రజాస్వామ్యం లో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థలో పనిచేసే కార్మికులు తమ డిమాండ్లను నేరవేర్చాలని నిరసన తెలిపే హక్కు ఉంది. వారు చేసిన వాటిలో కొన్ని డిమాండ్ల కు పరిష్కారం చూపుతుంది ప్రభుత్వం. గతం లో ఇదే ధోరణి కొనసాగింది తెలంగాణ రాష్ట్రం లో. కాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి  కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె ప్రకటిస్తే , తెలంగాణ రాష్ట్ర సర్కార్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నది. ఏకంగా కార్మికులను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నది. తెలంగాణ అధినేత చిన్న ఉద్యోగులపై ఎందుకంత కసితో ఉన్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితి తెలంగాణలో ఎందుకొచ్చిందో తెలుసుకుందాం ఒకసారి.

ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులను డీలర్లు ప్రజలకు అందజేస్తారు. ఆయితే రేషన్ డీలర్లు గత కొద్ది నెలలుగా తమకు ఇచ్చే కమీషన్ పెంపు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కోసం రాష్ట్ర సర్కార్ ఒత్తిడి తెస్తున్నారు, సర్కారుతో చర్చలు జరిపారు. ప్రభుత్వం సరైన పరిష్కారం  చూపకుండా మీనమేషాలు లెక్కించడంతో తాజా గా  సమ్మె నోటీసు ఇచ్చి జూలై 1 నుండి రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని రేషన్ డీలర్లు హెచ్చరించారు.

ఈ సమ్మె నోటీసుల జారితో ప్రభుత్వం రగిలిపోయింది. రేషన్ డీలర్ల పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఒక్క కలం పోటుతో డీలర్ల ను మూకుమ్మడిగా తొలగించాలని నిర్ణయించింది. జూలై 5 నుంచి రేషన్ డీలర్ల స్థానంలో మహిళా సంఘాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు చేపడుతామని స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్. సమ్మె పేరు తో పంపిణీ నిరాకరిస్తున్న రేషన్ డీలర్ల పై సస్పెన్ వేటు కు రంగం సిద్ధం చేసింది.

సర్కారు కాఠిన్య నిర్ణయం పై సిద్దిపేట జిల్లా లోని గజ్వేల్ లో ఓ రేషన్ డీలర్ ఆందోళన చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటి మీద కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నారు. రిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. గతంలో జరిగిన సంఘటనలు చూద్దాం.

ఈ నెల మొదటి వారంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారి చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు అని టీఎస్ ఆర్టీసీ యూనియన్లు హెచ్చరించాయి. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించక పొవడం తో ఆర్టీసీ కార్మికులు సమ్మె కు సిద్ధం  అయ్యారు. వారు సమ్మెకు దిగుతారని తెలిసి ఏకంగా సిఎం కేసిఆర్ ర్ చిర్రబుర్రులాడారు. కార్మికులు సమ్మెకు పోతే ఉద్యోగాలు ఊడబీకుతామని, ఆర్టీసి మూసిపడేస్తామని వార్నింగులు కూడా ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుక సమస్యలు పరిష్కరించలేమన్నారు. గతంలో కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువే 44 శాతం ఫిట్ మెంట్ పెంచామన్నారు. మళ్ళీ సమ్మె లు ఏంది గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే సమ్మె లో పాల్గోంటారో వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. కానీ ఆ సమస్య ఎలాగోలా పరిష్కారమైంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉద్యోగులను ఎందుకు సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నదో అంతుచిక్కడంలేదని రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సాధనలో భుజం భుజం కలిపి కొట్లాటకు కలిసొచ్చిన వారిని స్వరాష్ట్రం సాధించికున్నాక ఎందుకు శత్రువులుగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కును టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తూ ఆర్టీసి కార్మికులను, రేషన్ డీలర్లను సస్పెన్షన్ పేరుతో భయపెట్టడం సరికాదని ప్రజా సంఘాలు, యూనియ*న్లు హెచ్చరిస్తున్నాయి. మరీ ఈ సస్పెన్షన్ వార్నింగ్ లు రేషన్ డీలర్లలకు, ఆర్టీసీ కార్మికుల కే పరిమితం అవుతాయా? రానున్న రోజుల్లో ఇంకా ఎవరి మీద సస్పెన్షన్ కొరడా ఝలిపిస్తారోనని ఉద్యోగులు, కార్మికులు భయపడుతున్నారు.

 

* రచయిత : జిల్లెల శ్రీకాంత్ రెడ్డి, జర్నలిస్టు, హైదరాబాద్.