ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీ వల్ల మనుషులు శారీరకంగా కష్టపడి పని చేసే అవసరం లేకుండా ఎంత కష్టమైనా పని అయినా సరే యంత్రాలతో పూర్తి చేయవచ్చు. ఈ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి రైతులకు ఉపయోగపడే అనేక యంత్రాలను తయారు చేశారు. ఇప్పటికే ఈ యంత్రాల ద్వారా రైతులు తమ పొలంలో వ్యవసాయ పనులను సులభంగా చేసుకుంటున్నారు. తాజాగా రైతులకు ఉపయోగపడే ఒక బుల్లి రోబోట్ ను హైదరాబాద్ కు చెందిన ‘ఎక్స్‌మెషిన్స్’ అనే సంస్థ తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. ఈ అధునాతన రోబోట్ సహాయంతో వ్యవసాయం చేసేటపుడు అవసరమయ్యే అన్ని రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు.
గతంలో రైతులు పంట పండించడానికి కూలీలు ఎక్కువగా దొరికేవారు కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయి. రోజురోజుకి కూలి రేట్లు పెరిగిపోవడమే కాకుండా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన రేట్లు కూడా అధికంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రస్తుత కాలంలో పంట పండించడం ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. దీంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు అప్పుల పాలు అవుతున్నారు. ఈ సమస్యల నుండి రైతులను బయటపడేయటానికి హైదరాబాద్ కి చెందిన ‘ఎక్స్‌మెషిన్స్’ అనే సంస్థ ఒక వ్యవసాయ బుల్లి రోబోట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బుల్లి రోబోట్ సహాయంతో వ్యవసాయంలో కలుపు తీయటం, మందు పిచికారి చేయటం, దుక్కి దున్నటం వంటి పనులు సులభంగా చేయవచ్చు.
రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బుల్లి రోబోట్ ని నాలుగు సంవత్సరాల పాటు అన్ని టెస్టులు పూర్తి అయిన తర్వాత ఇటీవల మార్కెట్లోకి విడుదల చేశారు.
దీని ధర రూ. 1.75 లక్షలగా ‘ఎక్స్ మెషిన్స్’ నిర్వాహకులు చెప్తున్నారు. ఇంత మొత్తంలో ధర చెల్లించలేని వారికి రెంట్ కు ఇస్తున్నారు. ఇది ఒక ఎలక్ట్రికల్ రోబోట్. ఇది పూర్తి ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 5 నుంచి 6 గంటలు పనిచేస్తుంది. ఒక వేళ దీనిని రెంట్ కు తీసుకోవాలంటే రెండు బ్యాటరీ సెట్లు అందిస్తారు. ఒకటి డిశ్చార్జ్ అవ్వగానే మరొకటి సెట్ చేసుకోవచ్చు. ఈ బుల్లి రోబోట్ సహాయంతో ఒక రోజులో 2.5 ఎకరాల వరకు సేద్యం చేసుకోవచ్చు.