సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, ఎరువుల నిల్వల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారంతో ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎరువుల రవాణాను సైతం అడ్డుకుంటున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల దుష్ప్రచారంలో రైతులు చిక్కుకోవద్దని, వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
సచివాలయంలో ఎరువుల లభ్యతపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ జిల్లాలో కూడా కొరత లేదని, చాలినన్ని నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. మరిన్ని ఎరువులు రానున్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎరువుల అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శిస్తూ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైసీపీని “విషవృక్షం లాంటి పార్టీ”గా అభివర్ణించిన చంద్రబాబు, మరో ఫేక్ స్టోరీని అల్లి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. యూరియా, ఎరువుల కొరత ఉందనే ప్రచారంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీని “ఫేక్ పార్టీ”గా అభివర్ణించిన ఆయన, నేరాలను నమ్ముకున్న పార్టీ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎరువుల డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్‌ఫెడ్ ద్వారా తరలించి రైతులకు సరఫరా చేస్తామని, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులు పక్కదారి పట్టకుండా చూస్తామని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దుష్ప్రచారం చేసే వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
తప్పుడు పోస్టులు చేసి ఆందోళనలను రేకెత్తించి, రాజకీయ ప్రయోజనం పొందాలని చూసే వాళ్ల తాట తీస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలతో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని, మొన్నటి వరకు మహిళలపై, నిన్న రాజధానిపై, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని నియంత్రిస్తామని చంద్రబాబు తెలిపారు.


