క‌ష్టాల్లో టీమిండియా.. ప‌రువు నిలబెట్టుకునేలా లేరే!

ఐపీఎల్ త‌ర్వాత ఆస్ట్రేలియా ఫ్లెటెక్కిన టీమిండియా మూడు వ‌న్డేలు, మూడు టీ 20 లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇప్ప‌టికే రెండు వ‌న్డేలు ఆడి ఓడిన భార‌త్ సిరీస్‌ని చేజార్చుకుంది. ఇక కాన్‌బెర్రా వేదిక‌గా ఈ రోజు మూడో వ‌న్డే జ‌రుగుతుండ‌గా, తొలుత టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో శుభ‌మ‌న్ గిల్ వ‌చ్చాడు. మొదటి బాల్ నుండి ఆసీస్ బౌల‌ర్ల‌ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డ శిఖ‌ర్ ధావన్ (16: 27 బంతుల్లో 2×4) క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేయ‌గా, సులు‌వైన క్యాచ్‌తో ఔట‌య్యాడు.

ఇక శిఖ‌ర్ ధావ‌న్ ఔట్ కావ‌డంతో కోహ్లీ బ్యాటింగ్‌కు రాగా, గిల్‌తో క‌లిసి స్కోర్ బోర్డ్‌ని ముందుకు న‌డిపే ప్ర‌య‌త్నం చేశాడు. కాని గిల్ 33 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు అనంతరం క్రీజులోకి వ‌చ్చిన శ్రేయాస్ అయ్య‌ర్(19) కాసేపు షాట్స్‌తో అల‌రించిన ఎక్కువ సేపు నిల‌వలేకపోయాడు . ఇక కేఎల్ రాహుల్‌(5) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. కొద్ది సేప‌టి త‌ర్వాత కోహ్లీ 63 ప‌రుగుల ద‌గ్గ‌ర కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా, జ‌డేజా ఉన్నారు.

భార‌త్ ప్ర‌స్తుతం ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంది. ఈ మ్యాచ్ అయిన గెలిచి పరువు నిల‌బెట్టుకోవాల‌ని భావించిన టీమిండియాకు క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మయాంక్ అగర్వాల్‌, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, చహల్‌ స్థానాల్లో శుభ్‌మన్ గిల్‌, నటరాజన్‌, శార్దుల్, కుల్దీప్‌ యాదవ్‌ల‌కు చోటు కల్పించగా, బౌల‌ర్స్ అయిన ఈ మ్యాచ్‌ని నిలబెడ‌తారా అనేది చూడాలి.

తుది జట్లు
టీమిండియా: శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, నటరాజన్‌

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, అలెక్స్‌ కారీ(వికెట్‌ కీపర్‌), కామరూన్‌ గ్రీన్‌, ఆష్టన్‌ అగర్‌, సీన్‌ అబాట్‌, ఆడం జంపా, హేజల్‌వుడ్