లండన్‌లోని పౌరాణిక లార్డ్స్ మైదానంలో మరో చారిత్రక క్షణం నమోదైంది.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023–25) ఫైనల్‌లో దక్షిణాఫ్రికా సంచలన విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో సఫారీ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందుతూ తమ తొలి టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీనితో, 27 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐసీసీ టైటిల్ కలను సాకారం చేసుకుంది ఆ జట్టు. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇదే దక్షిణాఫ్రికా సాధించిన రెండో ఐసీసీ కిరీటం కావడం విశేషం.
ఫైనల్ ప్రారంభంలో టాస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూలు 212 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా జట్టు కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 207 పరుగులు చేసి సఫారీ జట్టుకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ కఠిన లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా పోరాటం చేసింది.. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఓపెనర్ మార్‌క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను విజయం దిశగా నడిపించాడు. 207 బంతుల్లో 14 ఫోర్లు సాయంతో 136 పరుగులు చేసి జట్టును విజయ పథంలో నడిపించాడు. కెప్టెన్ బవుమా సహాయంగా నిలిచి, 134 బంతుల్లో 66 పరుగులు చేశాడు. బేడింగ్‌హామ్ 18 పరుగులతో మద్దతుగా నిలిచాడు.
ఈ విజయం ద్వారా దక్షిణాఫ్రికా 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన అరుదైన జట్లలో చోటు సంపాదించింది. టెస్ట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం మూడు జట్లు మాత్రమే లార్డ్స్‌లో ఇంత పెద్ద లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించాయి.. 1984 వెస్టిండీస్ (344 పరుగులు), 2004 – ఇంగ్లాండ్ (282 పరుగులు), 2022 – ఇంగ్లాండ్ (277 పరుగులు) 2025 – దక్షిణాఫ్రికా (282 పరుగులు) ఛేదించాయి. ఈ విజయం దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఒక కొత్త యుగాన్ని తెరిచింది. గతంలో “చోకర్స్” అనే పేరు తెచ్చుకున్న ఈ జట్టు.. ఇప్పుడు తన ఆటతీరు ద్వారా ప్రపంచానికి సమాధానం ఇచ్చింది. ఇది కేవలం విజయం కాదు… దశాబ్దాల నిరీక్షణకు లభించిన గౌరవాన్ని చాటే మైలురాయి.