క్రికెట్ అభిమానుల‌కి షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో రాజుకున్న వివాదం

భార‌త క్రికెట్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. వ‌న్డేలు, టీ 20ల‌లో త‌న‌దైన శైలిలో బ్యాట్‌ని ఝుళిపిస్తూ భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు రోహిత్ శ‌ర్మ‌. రీసెంట్‌గా ఐపీఎల్ ఫైన‌ల్‌లోను కీల‌క ఇన్నింగ్స్ ఆడి ముంబై ఇండియ‌న్స్ టీంకు ట్రోఫీ ద‌క్కేలా చేశాడు. అయితే ఫిట్‌నెస్ కారణాల రీత్యా రోహిత్ శ‌ర్మ వ‌న్డేలు, టీ20ల‌కు ప‌క్క‌న పెడుతున్న‌ట్టు బీసీసీఐ కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించింది. అయితే కోహ్లీ టెస్ట్‌ల‌కు గైర్హాజ‌రు కార‌ణంగా రోహిత్ శ‌ర్మ‌ని ఎంపిక చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

కాని తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న రోహిత్‌, ప‌క్క‌టెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న ఇషాంత్‌.. ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రీసెంట్‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గాయాలపాలైన వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు. అయితే రోహిత్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురికాగా, డిసెంబర్ 8 వరకు అతడు ఫిట్ కాబోడని ఎన్‌సీఏ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఒక‌వేళ త‌ర్వాత అయిన రోహిత్ ఆసీస్ వెళ్లిన‌ప్ప‌టికీ, రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సి వ‌స్తుంది. అంటే మొద‌టి రెండు టెస్ట్‌లు అత‌ను ఆడే ఛాన్స్ ఉండ‌దు. జ‌న‌వ‌రి 7 నుండి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌కు రోహిత్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

ఒకవేళ రోహిత్ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగితే శ్రేయస్ అయ్యర్‌ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఇక ఇషాంత్ కూడా ఆడ‌ని ప‌క్షంలో అత‌ని సిరాజ్‌కు ఆడే ఛాన్స్ ద‌క్కుతుంది. అయితే రోహిత్‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రోహిత్ బాగానే కనిపిస్తున్న‌ప్ప‌టికీ, బీసీసీఐ, రవిశాస్త్రి అత‌నిని కావాల‌నే ప‌క్క‌న పెడుతున్నారు. గాయంతో ఉన్న సాహాను ఆసీస్ తీసుకెళ్ళారు కాని, రోహిత్ విష‌యంలో ఎందుకు ఇన్ని రాజ‌కీయాలు చేస్తున్నారంటూ నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో బీసీసీఐ నుండి ఏదైన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందా అనేది చూడాలి.