Rohit Sharma: ఇంత దారుణం ఎప్పుడూ లేదు.. 14 ఏళ్ల కెరీర్‌లో రోహిత్ వరస్ట్ సిరీస్..!

టీమిండియా అభిమానులకు ఇది కొంచెం చేదు వార్తే. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డే జెర్సీలో మళ్లీ చూడాలంటే కనీసం ఆరు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఘోరంగా విఫలమవడంతో, అతడి ఫామ్, భవిష్యత్ ప్రణాళికలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. 14 ఏళ్ల అంతర్జాతీయ వన్డే కెరీర్‌లోనే ఇది అతడికి అత్యంత నిరాశకరమైన సిరీస్‌గా నమోదైంది.

నిజానికి ఈ సిరీస్‌కు ముందు వరకు రోహిత్ ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. గత డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన రోహిత్, వైజాగ్ మ్యాచ్‌లో 73 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టుకు సులువైన విజయాన్ని అందించాడు. అంతకుముందు రాంచీలో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టి మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు. అదే జోష్‌తో విజయ్ హజారే ట్రోఫీలోనూ 155 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచాడు.

అలాంటి హిట్‌మ్యాన్ న్యూజిలాండ్ సిరీస్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికలపై జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 61 పరుగులే చేశాడు. ముఖ్యంగా ఇండోర్‌లో జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో 11 పరుగులకే ఔట్ కావడం జట్టును కష్టాల్లోకి నెట్టింది. దాంతో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌లో రోహిత్ సగటు 20 పరుగులకే పరిమితం కావడం అతడి కెరీర్‌లోనే చెత్త దశగా మారింది.

రోహిత్ వరుస వైఫల్యాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. కామెంటేటర్లు సైమన్ డూల్, మాజీ కోచ్ రవిశాస్త్రి లాంటి వారు 2027 వరల్డ్ కప్ నాటికి రోహిత్ వయసు, ఫిట్‌నెస్ ఎంతవరకు సహకరిస్తాయనే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వయసులో ఆటపై ఆకలి, నిరంతర మ్యాచ్ ప్రాక్టీస్ ఎంతో కీలకమని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వన్డే షెడ్యూల్‌లో పొడవైన గ్యాప్‌లు ప్లేయర్ రిథమ్‌పై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం టీమిండియా నెక్స్ట్ వన్డే సిరీస్ 2026 జులైలో ఇంగ్లాండ్ టూర్‌లోనే ఉంది. అంటే అప్పటి వరకు అభిమానులు రోహిత్‌ను వన్డేల్లో చూడలేరు. ఈ మధ్యకాలంలో ఆయన ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ బ్రేక్ అతడికి తిరిగి ఫామ్ అందుకునే అవకాశమిస్తుందా? లేక వన్డే కెరీర్‌పై మరిన్ని ప్రశ్నలు తెస్తుందా? అన్నది కాలమే తేల్చాలి.