ఓటమి బాధలో ఉన్న టీం ఇండియాకి మరో షాక్ !

Mohammed Shami ruled out of Test series

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఇండియా టీం దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. పుండు మీద కారం జల్లినట్లు భారత జట్టుకు మరో షాక్ తగిలింది. టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్‌ షమీ గాయం కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ప‌క్క‌టెముక‌ల గాయంతో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్‌ కు దూరమవగా… మరో సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ కూడా సిరీస్‌ నుంచి వైదొలగడం భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.

Mohammed Shami ruled out of Test series
Mohammed Shami ruled out of Test series

కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ శనివారం మొదటి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన షమీకి దెబ్బ తగిలిన విషయం తెల్సిందే. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో షమీ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో జట్టు స్కోరు 36/9 వద్ద ఉండగానే ఆట మధ్యలోనే షమీ రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. కాగా షమీ స్థానంలో బీసీసీఐ మరో పేసర్ కు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ ఇప్పటికే వన్డే, టీ-20 సిరీస్ లను ఆడింది. వన్డే సిరీస్ ను 1-2తో కోల్పోయిన భారత్, 20 సిరీస్ ను 2-1తో గెలుచుకుంది.

ఇక మొదటి టెస్టులో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ 244 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ అవడంతో భారత్‌కు 53 పరుగులు ఆధిక్యం లభించింది. అయితే ఈ మ్యాచ్ లో పట్టు బిగిస్తుందనుకున్న భారత జట్టుకు ఆసీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ … ఆసీస్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌ను 36/9 వద్ద ముగించింది. 90 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా సునాసయంగా విజయం సాధించింది. ఇక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం కానుంది. అయితే విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తల్లి కాబోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల మీద భారత్ కు పయనం కానున్నాడు. దీంతో అజింక్య రహానే మిగిలిన మూడు టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు.చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లకి రోహిత్ జట్టులోకి వస్తాడని సమాచారం.