ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు ఉత్కంఠగా సాగింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో గెలిచి జపాన్ యువ సంచలనం నవోమి ఒసాకా సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగో సీడ్ ఒసాకా నంబర్ 1 ర్యాంకు అందుకున్న తొలి జపాన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన 21 ఏళ్ల ఒసాకా కెరీర్లో రెండో గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుంది. ఆరేండ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ చేరినా రెండు సార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటోవాకు నిరాశ తప్పలేదు.
శనివారం హోరాహోరీగా జరిగిన సమరంలో నాలుగో సీడ్ నవోమీ ఒసాకు 7-6 (2), 5-7, 6-4 తో చెక్ రిపబ్లిక్ తార పెట్రా క్విటోవాను మట్టికరిపించింది. సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఎనిమిదో సీడ్ క్విటోవా ఈసారి ఒక్కసెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. వీరిద్దరూ తొలిసారి పోటీపడగా ఒసాకా సంచలన ప్రదర్శనతో ట్రోఫీతో పాటు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
తొలి సెట్ రసవత్తరంగా సాగి తారాస్థాయికి చేరింది. ఫలితంగా ఆ సెట్ టై బ్రేక్‌కు దారి తీయగా.. అందులోనూ ప్రత్యర్థి క్విటోవాపై ఒసాకా 7-6 (2)తో విజయం సాధించింది. రెండో సెట్‌లో బలంగా పుంజుకున్న క్విటోవా మళ్లీ రేసులోకి వచ్చింది. దీంతో ఒసాకా 5-7తో రెండో సెట్‌ను చేజార్చుకుంది. క్విటోవా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ ఆడితే.. నవొమీ నిరాశకు లోనైంది. ఐతే నిర్ణాయక సెట్‌లో జపాన్ ప్లేయర్‌దే హవా. ఆఖరి సెట్‌లో దూకుడుగా ఆడి మూడో సెట్‌ను 6-4తో కైవసం చేసుకొని ప్రపంచ విజేతగా జపాన్ కెరటం నిలిచింది.