20 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ విజేతగా అల్కరాస్… బ్యాక్ గ్రౌండ్ కృషి ఇదే!

వింబుల్డన్ అంటే గుర్తుకొచ్చే పేర్లు ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌. వీళ్ల ఆటల్లో మెరుపులు, స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, వీళ్లు సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ సమయంలో ఫెదరర్‌, నాదల్‌ జోరు తగ్గాక.. జకోవిచ్‌కు ఫైనల్లో సవాలు విసిరే ఆటగాళ్లే కనిపించలేదని అనేవారు. ఈ సమయంలో 20 ఏళ్ల కుర్రాడు మెరిసాడు.

అవును… వింబుల్డన్‌ లో తొలి సెట్‌ గెలిచిన తర్వాత మ్యాచ్‌ లో ఓటమన్నదే లేని చరిత్ర కలిగిన జకోవిచ్‌ ను ఫైనల్ లో ఓడించాడు ఒక యువకుడు అల్కరాస్. అసాధారణ నైపుణ్యాలతో.. అమోఘమైన పోరాటంతో.. అలుపెరగని పట్టుదలతో జకోవిచ్‌ ను ఓడించి.. తొలి వింబుల్డన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. చరిత్ర సృష్టించాడు.

ఆదివారం రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఈ టాప్‌ సీడ్‌ స్పెయిన్‌ ఆటగాడు 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో జకోవిచ్‌ పై విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన మారథాన్‌ పోరులో.. తొలి సెట్‌ ఓడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న అల్కరాస్‌ గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2018 నుంచి వింబుల్డన్‌లో ఓటమే లేని జకోవిచ్‌కు పరాజయాన్ని రుచి చూపించాడు.

వింబుల్డన్‌ అంటే చాలు.. టైటిల్‌ ను జకోవిచ్‌ కు వదిలేసి రన్నరప్‌ ట్రోఫీ కోసమే మిగతా ఆటగాళ్లు పోటీ పడేవారనే కామెంట్లు వినిపించేవి. ఈ టోర్నీలో జకోవిచ్‌ ఆధిపత్యం ఆ స్థాయిలో కొనసాగింది. 2018 నుంచి ఇక్కడ అతనే ఛాంపియన్‌. ఇక ఫైనల్‌ మ్యాచ్ జరిగిన సెంట్రల్‌ కోర్టులో అయితే.. అతను పదేళ్ల కాలంలో వరుసగా 45 మ్యాచ్‌ లు గెలిచాడు. అలాంటి జకోవిచ్ ను అల్కరాస్ ఓడించాడు.

దీంతో… ఎవరీ అల్కరాస్ అనే చర్చ నెట్టింట వైరల్ అయ్యింది. స్పెయిన్‌ దేశానికి చెందిన మాజీ టెన్నిస్‌ ఆటగాడైన గొంజాలెజ్‌ కుమారుడే ఈ అల్కరాస్. ఈ నేపథ్యంలో… తాను డైరెక్టర్‌ గా ఉన్న టెన్నిస్‌ క్లబ్‌ లో తనయుడికి నాలుగో ఏటనుంచే రాకెట్ చేతపట్టించి ఓనమాలు నేర్పించాడు.

ఇదే క్రమంలో… 2018లో మాజీ నంబర్‌ వన్‌ జువాన్‌ కార్లోస్‌ ఫెరీరో అకాడమీలో చేరిన అల్కరాస్‌ ఆటలో మరింత రాటుదేలాడు. 16 ఏళ్లకే ఏటీపీ టోర్నీలో అడుగుపెట్టాడు. 17 ఏళ్లకే గ్రాండ్‌ స్లామ్‌ అరంగేట్రం చేశాడు. వింబుల్డన్‌ కు ముందు 2022 యుఎస్‌ ఓపెన్‌ సహా 11 ఏటీపీ టూర్‌ టైటిళ్లు గెలిచాడు. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ తో గ్రాండ్‌ స్లామ్‌ బోణీ కొట్టాడు.