ఐపీఎల్‌ 2020: ఆయన మాతో ఉండటం ఓ వరం.. అసలు సీక్రెట్‌ బయటపెట్టిన అమిత్‌

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండు విజయాలతో మంచి శుభారంభాన్ని ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై సూపర్‌ విక్టరీ అందుకున్న అయ్యర్‌ సేన.. తన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్న యువ ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి జోరు మీద ఉంది. ఇదే క్రమంలో మంగళవారం మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లలో ఉత్సాహం, కసి, ఆటలో పరిపక్వత రావడానికి గల అసలు సీక్రెట్‌ను ఆ జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బయటపెట్టాడు.

ఢిల్లీ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ జట్టులో పాజిటివిటీని కలగించాడని, క్రికెట్‌లో ఆయనకున్న అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ‘సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్‌ అడిన అనుభవం కలిగిన పాంటింగ్‌కు ఆటగాళ్ల స్వభావం గురించి పూర్తిగా తెలుసు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల మనస్తత్వం, దూకుడు శైలిని సునిశితంగా పరిశీలిస్తుంటారు. ఆటగాళ్లకు ఏమాత్రం ఎక్కువ చేస్తున్నారనిపించినా కట్టడి చేస్తారు.

వైపల్యం చెంది బాధపడితే వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. తనతో పాటు అందరూ పాజిటివ్‌గా ఉండాలనుకుంటాడు. పాంటింగ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లకు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశీలించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడటం గ్రేట్‌ అనే చెప్పాలి. ఏ ఒక్క క్రికెటర్‌ను తక్కువ చేయడం, నిరుత్సాహపరచడం పాంటింగ్‌కు తెలియడు’ అంటూ అమిత్‌ మిశ్రా ప్రశంసల జల్లు కురిపించాడు.