Nicholas Pooran: 29ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పూరన్.. వెనకున్న అసలు కథేంటి?

ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తూ, వెస్టిండీస్‌కు చెందిన స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శరీర శ్రమ వయసును మించిన సమయంలో ఆటగాళ్లు తప్పుకుంటుంటే, కేవలం 29ఏళ్ల వయసులోనే పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. తన రిటైర్మెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పూరన్, “వెస్టిండీస్‌కి ప్రాతినిధ్యం వహించడమన్నది నాకు జీవితంలో గర్వకారణం” అంటూ భావోద్వేగమైన సందేశం ఇచ్చాడు.

వన్డేల్లో 61 మ్యాచ్‌ల్లో 1,983 పరుగులు చేసిన పూరన్, టీ20ల్లో వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 2,275 పరుగులు సాధించాడు. మొత్తం 106 టీ20లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో ఒక దశలో కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టిన ఆయన, “కెప్టెన్‌గా జట్టును నడిపించడం నా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టం” అని చెప్పాడు. అంతర్జాతీయంగా చివరిసారిగా 2024 డిసెంబరులో వెస్టిండీస్ తరఫున పూరన్ మైదానంలో అడుగుపెట్టాడు.

పూరన్ రిటైర్మెంట్ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచంలో ఫ్రాంచైజీ లీగ్‌ల ప్రభావం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్, పీఎస్‌ఎల్, సిపీఎల్ వంటి లీగ్‌లు ఆర్థికంగా లాభాలు అందిస్తుండటంతో, ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉండటం కనిపిస్తోంది. పూరన్‌కి కూడా ఇటువంటి ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో, తన దృష్టిని పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్‌పై కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్‌కు సిద్ధమైనట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వెస్టిండీస్ క్రికెట్‌లో నికోలస్ పూరన్ మిగిల్చిన ముద్ర మాత్రం అసాధారణమైనది. అత్యంత స్టైల్‌తో బ్యాటింగ్ చేసే అతడి ఆటతీరు, మైదానంలోని అనుభవం జట్టుకు విశేషంగా ఉపయోగపడింది. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీలకు పెద్ద అస్త్రంగా మారే అవకాశం ఉన్న పూరన్, అభిమానుల మదిలో మాత్రం వెస్టిండీస్‌కు సేవలందించిన సూపర్‌స్టార్‌గానే నిలిచిపోతాడు.

BRS Contractor Rajyalaxmi warns Revanth Reddy at BRK Bhavan | Interview | BRS Party | elugu Rajyam