క్రికెట్ ల‌వ‌ర్స్‌ని నిరాశ‌ప‌ర‌చిన టీమిండియా.. ఊరించి ఉసూరుమనించారు

కోవిడ్ అనంతరం తొలి మెగా సిరిస్..ఎన్నో ఆశలు..మరెన్నో అంచనాలు. ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన ఇండియా జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. వన్డే సిరిస్‌ను 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. బ్యాటింగ్‌లో ఓకే అనిపించినా.. ఫీల్డింగ్, బౌలింగ్ విబాగాల్లో తీవ్ర వైపల్యం చెందింది. ఇక సూపర్ ఫామ్‌తో చెలరేగిపోయిన ఆస్ట్రేలియా ప్లేయర్స్… అదిరే బ్యాటింగ్, హడలెత్తించే బౌలింగ్ తో సత్తా చాటారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన కీలకమైన వన్డేలో భారత జట్టు 51 పరుగులతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76), హార్దిక్ పాండ్యా(26) నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మరోసారి అద్భుతమైన శతకంతో ఆకట్టుకోగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకాలతో రాణంచారు. మ్యాచ్ చివర్లో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) కూడా పరుగుల వరద పారించారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇండియా బౌల‌ర్లు డీలా చెడ్డారు. జస్‌ప్రీత్ బుమ్రా (1/79) సహా షమీ (1/73), చహ‌ల్ (0/71), సైనీ (0/70), జ‌డేజా(0/60) పూర్తిగా నిరాశపరిచారు పాండ్యా(1/24) ఒక్కడే కాస్త తక్కువ పరుగులిచ్చాడు. అనంతరం భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పోరాటం ముగించింది

390 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా టీమ్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్(30), మయాంక్ అగర్వాల్(28) మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. మొదట ఇన్నింగ్స్‌ను మంచిగానే ప్రారంభించినా..అదే జోరును కొనసాగించలేకపోయారు. ఉపయోగం లేని షాట్లకు ప్రయత్నించి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో ధావన్, కమిన్స్ ఓవర్లో మయాంక్ పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్, విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను సరిచేసే ప్రయత్నం చేశారు. చాలా సహనంతో ఆడారు. వీలుచిక్కినప్పుడు మాత్రం ఫోర్లు కొడుతూ రన్ రేట్ పెరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే జంపా వేసిన 23వ ఓవర్ నాలుగో బంతిని లెగ్ సైడ్ ఫోర్ కొట్టిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ మార్క్ రీచ్ అయ్యాడు. కానీ ఇండియా ఫ్యాన్స్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్మిత్ సూపర్ డైవ్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్(38) పెవిలియన్ చేరాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ ఔటయ్యాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ బాధ్యాతయుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. వికెట్ పడినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జోరుగా బ్యాటింగ్ జోరు పెంచాడు. దాటిగా ఆడే ప్రయత్నంలో హెన్రీక్స్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత పాండ్యాతో కలిసి రాహుల్ మ్యాచ్ ను మనవైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ ధాటిగా ఆడాలనే తొందరలో ఔటయ్యాడు. ఆ తర్వాత జడేజా(24), పాండ్యా(28) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి వెనువెంటనే పెవిలియన్ చేరారు. దాంతో ఇండియా పోరాటం ముగిసింది. చివర్లో సైనీ, చాహల్ ఆల్ ఔట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.