ఇంగ్లాండ్ గడ్డపై భారత ఆటగాళ్లు ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా బ్యాట్, బాల్ రెండింటిలోనూ తన ముద్ర వేశాడు. ఈసారి మాత్రం తన బ్యాటింగ్‌తోనే చరిత్ర రాసేశాడు. టెస్టు క్రికెట్‌లో దిగువ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ విరుచుకుపడిన జడేజా, నిశ్శబ్దంగా భారత రికార్డుల్ని తిరగరాస్తూ… ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒకవైపు దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను చెరిపేస్తూనే, మరోవైపు సిరీస్‌ను సమం చేయాలన్న జట్టుని గెలుపు దిశగా నడిపించేందుకు తన వంతు పాత్ర పోషించాడు.
ఈ సిరీస్‌లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువగా బ్యాటింగ్ చేస్తూ జడేజా 516 పరుగులు సాధించడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు ఆ రికార్డు కలిగిన వీవీఎస్ లక్ష్మణ్ (2002 వెస్టిండీస్ పర్యటనలో 474 పరుగులు) రికార్డును చెరిపేశాడు. సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532) తర్వాత 500కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఇంతే కాదు… ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక అర్ధశతకాలు (6) చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా జడేజా నిలిచాడు. గతంలో ఈ ఘనత సునీల్ గవాస్కర్ (5 అర్ధశతకాలు) పేరిట ఉండగా… ఇప్పుడు జడేజా దాన్ని అధిగమించాడు. అంతేకాక, ఈ రికార్డుతో గెర్రీ అలెగ్జాండర్ (వెస్టిండీస్), వసీం రాజా (పాకిస్థాన్) సమానంగా నిలిచాడు.
