క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. భార‌త్‌- ఆసీస్ మ్యాచ్‌ను గ్రౌండ్‌లో నుండి చూసే ఛాన్స్

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ప‌రిస్థితుల‌ని పూర్తిగా మారిపోయాయి. ఓ మ‌నిషి మ‌రో మ‌నిషిని క‌ల‌వాలంటే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. క‌రోనాతో వినోదం పూర్తిగా క‌రువై పోయింది. థియేట‌ర్స్ బంద్ అయ్యాయి. గ్రౌండ్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూసే ప‌రిస్థితులు లేకుండా పోయాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ సిరీస్ మొత్తం పూర్తిగా బ‌యో బబుల్ వాతావ‌ర‌ణంలోనే జ‌రిగింది. దీంతో మ్యాచ్‌ల‌న్నింటిని టీవీలో వీక్షించారు ప్రేక్ష‌కులు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న భారత్‌, ఆస్ట్రేలియాల టెస్టు మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్ త‌ర్వాత ఏ సిరీస్‌కు ప్రేక్ష‌కుల‌ని అనుమ‌తించ‌క‌పోగా, తొలిసారి క్రికెట్ ఆస్ట్రేలియా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అయితే వంద శాతం ప్రేక్ష‌కుల‌ని అనుమ‌తించ‌కుండా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబ‌ర్ 17 నుంచి అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో భార‌త్- ఆసీస్‌ మధ్య తొలిసారి జ‌ర‌గ‌నునన్న డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌కు సుమారు 27,000 మంది ప్రేక్షకులకు అంటే స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని సీఏ మంగళవారం ప్రకటించింది. టెస్టు జరిగే ఐదు రోజులూ 27 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతాం’ అని సీఏ తమ క్రికెట్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇక మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే మ్యాచ్‌కు కేవ‌లం 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌నే అనుమ‌తిస్తామ‌ని విక్టోరియా ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది. సిడ్నీ టెస్ట్‌కు 50 శాతం, బ్రిస్బేన్‌లో జ‌ర‌గ‌నున్న చివ‌రి టెస్ట్‌కు 75 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి క‌ల్పించ‌నున్న‌ట్టు సీఏ పేర్కొంది. భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగు టెస్ట్ లు జ‌ర‌నుండ‌గా, వీటికి రోహిత్ శ‌ర్మ అందుబాటులో ఉంటారు. వ‌న్డే, టీ 20 సిరీస్‌ల‌కు అత‌నికి విశ్రాంతిని క‌ల్పించారు. ఆసీస్ టూర్‌లో భార‌త్‌ మూడు వన్డేలు (నవంబర్‌ 27 నుంచి), తర్వాత మూడు టి20లు (డిసెంబర్‌ 4 నుంచి) ఆడుతుంది. అనంత‌రం నాలుగు టెస్టుల సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ‘పింక్‌బాల్‌’ మ్యాచ్‌తో మొదలవుతుంది