అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయాల బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసలు సిసలైన ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకొని విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఖాతా తెరిచి పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. అబుదాబి వేదికగా ఢిల్లీతో జరిగన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టిన సన్‌రైజర్స్ టీం ఢిల్లీ జట్టును 147 పరుగులకే కట్టడి చేశారు. దీంతో 15 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వార్నర్ సేనకు మంచి శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్(45; 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో(53; 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) గట్టి పునాది వేశారు. అయితే మనీశ్ పాండే(3) తీవ్రంగా నిరాశపర్చడంతో ఆరెంజ్ ఆర్మీ కష్టాల్లో పడినట్టయింది. అయితే కేన్ విలియమ్సన్ ( 41; 26 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించడంతో పాటు చివర్లో అబ్దుల్ సామద్(12 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ ముందు పోరాడే స్కోర్‌ను ఉంచగలిగింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావించిన ఢిల్లీ ఆశలపై హైదరాబాద్ బౌలర్లు నీళ్లు చల్లారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఢిల్లీ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్ ధావన్(34; 31 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్ పంత్(28; 27 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మెయిర్(21; 12 బంతుల్లో 2 సిక్స్‌లు)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించాడు. నటరాజన్, ఖలీల్ అహ్మద్‌కు వికెట్‌కు దక్కింది.